కసి తీర్చుకున్న కమలం

ఉత్తరప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమిపాలయిన కమలం పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో కసి తీర్చుకుంది. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిని ఓడించి తన సత్తాను చాటింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీలో శాసనసభ్యుల బలం ప్రకారం బీజేపీకి ఎనిమిది స్థానాలు సునాయాసంగా దక్కుతాయి. అయితే తొమ్మిదో స్థానానికి కూడా బీజేపీ పోటీలోకి దింపింది. ఎస్పీ, బీఎస్పీ లపై పగ తీర్చుకునేందుకు రాజ్యసభ ఎన్నికలను వేదికగా చేసుకుంది బీజేపీ.
బీఎస్పీ అభ్యర్థిని ఓడించాలని....
ఉత్తర్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ కూడా ఒక స్థానం తన బలాన్ని బట్టి గెలుచుకుంది. అయితే బీఎస్పీకి కేవలం 18 సభ్యులు మాత్రమే ఉండటంతో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్, మిగిలిన పార్టీలతో జత కట్టి తన అభ్యర్థిని బరిలోకి దించింది. ఇది గమనించిన బీజేపీ బీఎస్పీ సభ్యులను బుట్టలో వేసుకుంది. బీజేపీ అభ్యర్థి అనిల్ అగర్వాల్, బీఎస్పీ అభ్యర్థి భీమ్ రావ్ అంబేద్కర్ మధ్య పోటీ నెలకొంది. బీఎస్పీ అభ్యర్థులు తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయకుండా బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడంతో ఆ పార్టీ రాజ్యసభ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
క్రాస్ ఓటింగ్ తో.....
బీఎస్పీకి చెందిన అనిల్ కుమార్ సింగ్, సమాజ్ వాదీ పార్టీకి చెందిన నితిన్ అగర్వాల్ లు బీజేపీకే ఓటువ ేవశఆరు. వీరితో పాటు చిన్నాచితాకా పార్టీలు కూడా బీజేపీ అభ్యర్థికే అండగా నిలిచాయి. దీంతో మాయావతి పార్టీకి ఓటమి తప్పలేదు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీలు కలసి గొరఖ్ పూర్, ఫూల్ పూర్ లోక్ సభ స్థానాల్లో బీజేపీని ఓడించిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో కసితో రగిలిపోతున్న కమలనాధులు రాజ్యసభ ఎన్నికల్లో తమ వ్యూహాన్ని అమలు చేసి బీఎస్పీని మట్టికరిపించారు. మాయావతి పార్టీకి ఘోర పరాభావం ఎదురైంది. సొంత పార్టీ నేతలే క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం మాయావతి జీర్ణించుకోలేకపోతున్నారు.
