కరీంనగర్ లో సై .. అంటే ...సై

స్థలం నువ్వు చెప్పినా సరే... నేను చెప్పమన్నా సరే.... తేడీ నువ్వు నిర్ణయించినా సరే... నేను డిసైడ్ చేసినా సరే... సవాల్... బస్తీ మే సవాల్. కరీంనగర్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం. మొత్తం మీద తేదీ ఖరారయింది. ప్లేసూ... డిసైడ్ అయింది. ఇక తేల్చుకోవటమే మిగిలింది. కరీంనగర్ జిల్లాలో గత కొంతకాలంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలుచోటు చేసుకుంటున్నాయి. కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని, టీఆర్ఎస్ హయాంలో నగరం భ్రష్టుపట్టిపోయిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కరీంనగర్ అభివృద్ది బాటలో పయనిస్తుందని, దేనికైనా సిద్ధమని గులాబీ నేతలు సవాల్ విసిరారు. దీనికి చర్చకు మేమూ సై అన్నారు కాంగ్రెస్ నేతలు.
30న చర్చకు సిద్ధమంటూ....
ఈ నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన జర్నలిస్టు సంఘాలు, మేధావుల సమక్షంలో చర్చకు సిద్ధమని కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ ప్రకటించారు. పొన్నం కూడా అందుకు ధీటుగా తాను కూడా రెడీ అన్నారు. అయితే చర్చకు మేయర్ కాకుండా మంత్రి, ఎంపీ వినోద్ రావాలని పొన్నం ప్రభాకర్ లింకు పెట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ తో మేయర్ రవీందర్ సింగ్ చర్చిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ గతంలో ఎంపీ గా ఐదేళ్లు ఉన్నా కరీంనగర్ కు చేసిందేమీ లేదని పొన్నం మీడియా ముందుకు వచ్చి ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ లో ఎంత అభివృద్ధి జరిగిందనేది గణాంకాలతో సహా వివరిస్తామని మేయర్ చెబుతున్నారు. బట్ట కాల్చి ముఖంపై వేయడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిపోయిందని, కరీంనగర్ లో ఇక భవిష్యత్ లేదనే కాంగ్రెస్ నేతలు పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద 30వ తేదీన అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య చర్చ జరుగుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
- Tags
- కరీంనగర్

