‘కమిషన్ల పాలన’ అంటూ కస్సుమన్న జగన్

వైఎస్ జగన్మోహన రెడ్డి మరో అంశం మీద కూడా స్పందించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని సమర్థంగా అమలు చేయడానికి ప్రభుత్వం శ్రద్ధ చూపించడం లేదంటూ ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ రాశారు. ప్రజలు, రైతులు వైద్యం కోసం పొలాలు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతున్నదని విచారం వ్యక్తం చేశారు. పట్టిసీమ వంటి ప్రాజెక్టుల్లో కమిషన్లకు ఆశపడి 21.5 శాతం ఎస్టిమేట్లు పెంచారని, ఆరోగ్య శ్రీకి మాత్రం అవసరమైన నిధులను కూడా విడుదల చేయడం లేదన జగన్ తప్పుపట్టారు. మొత్తానికి ఆరోగ్య శ్రీ గురించి పట్టించుకోకుండా, వైఎస్సార్ ప్రారంభించిన మంచి పథకానికి చంద్రబాబు సర్కారు ప్రణాళిక ప్రకారం తూట్లు పొడుస్తున్నట్లుగా కనిపిస్తోందని జగన్ అందులో ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీఇంబర్స్ మెంట్ లను కూడా ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు.
ఆరోగ్యశ్రీ ని పట్టించుకోకపోవడం గురించి ఈనెల 9వ తేదీన అన్ని జిల్లాల్లో కలెక్టరు కార్యాలయాల ఎదుట ఆరోగ్య శ్రీ రోగులు, వారి బంధువులతో కలిపి వైఎస్సార్ కాంగ్రెస్ ధర్నాలు చేస్తుందని జగన్ హెచ్చరించారు.
జగన్ కు మరి తెలుసో.. లేదో..
కమిషన్ల కోసం ఎస్టిమేట్లను భారీగా రివైజ్ చేసి నిధులు ఇస్తున్నారంటూ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం బాగానే ఉంది. కానీ జగన్ గుర్తించాల్సిన మరో సంగతి ఏంటంటే.. ఆరోగ్యశ్రీ కూడా కార్పొరేట్ ఆస్పత్రులకు దోచిపెట్టే వ్యవస్థగానే మారిపోయింది. క్షేత్రస్థాయిలో.. ఆరోగ్యశ్రీ నిధులను హాస్పిటళ్లకు పంచిపెట్టడం కూడా కమిషన్ల దందాగానే కొనసాగుతోందనే వదంతులు ప్రజల్లో ఉన్నాయి. మరి జగన్ కు ‘ఆరోగ్యశ్రీ’ ముసుగులో కార్పొరేట్ ఆస్పత్రుల కమిషన్ల దందా గురించి తెలియదా? లేక, వారి మీద ఆయనకు సానుభూతి ఉన్నదా? అనేది అర్థం కావడం లేదు.
(కానీ క్షేత్రస్థాయి వాస్తవాలను చూస్తే.. ఆరోగ్యశ్రీకార్డు ఉన్న వారికి ఏ కార్పొరేట్ ఆస్పత్రిలోనూ వైద్యం తిరస్కరించడం లేదు. ముందో వెనుకో డబ్బు చెల్లింపు అవుతాయనే ధీమాతో ఆస్పత్రులు చికిత్స చేస్తూనే ఉన్నాయి. )

