కమలంలో కదలిక ఎందుకొచ్చింది?

ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. గత వారం పది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను మేధావులే కాదు, సాధారణ ప్రజలు సైతం నిశితంగా గమనిస్తున్నారు. ఏపీ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది. ఏపీని ఆదుకోవాల్సిన అసవరం కేంద్రంపై ఉంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రులే ఒప్పుకొంటున్నారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీనే పార్లమెంటులో ఈ విషయాన్ని వెల్లడించి ఉసూరు మన్నారు. మరి అలాంటి రాష్ట్రానికి చెందిన ఏపీ బీజేపీ నేతలు మాత్రం టంగ్ పారేసుకుంటున్నారు.
లెక్కలు మాత్రం ఘనం....
ఏపీకి కేంద్రం ఎంతో ఇచ్చిందని అంటున్నారు. లెక్కలు గణాంకాలు అంటూ కొన్ని వివరించారు కూడా. అంతేకాదు, తమను బద్నాం చేస్తున్నదంటూ అధికార టీడీపీపై నిప్పులు చెరుగుతున్నారు. అధిష్టానం ఓ రేంజ్లో తలంటేసినా సోము వీర్రాజు ఎంత మాత్రమూ వెనక్కి తగ్గడం లేదు. పైగా చంద్రబాబు సర్కారుపై మరింతగా విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుందా? అంటూ లేనిపోని విమర్శలు చేస్తున్నారు. ఈయన కూడా లెక్కలు వల్లె వేశారు. కేంద్రం అంతిచ్చింది. ఇంతిచ్చింది అంటూ లెక్కలు చెప్పారు.
మరి ఎందుకు ప్రాధేయపడటం?
అంతా బాగానే ఉంది. మరి అంత ఇచ్చినప్పుడు కేంద్రమే స్వయంగా (అటు ప్రధాని మోడీ, ఇటు ఆర్థిక మంత్రి జైట్లీ) ఏపీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఎంతో చేయాల్సిన అసవరం ఉందని ఎందుకు చెప్పినట్టు? హుటాహుటిన కదలిక ఎందుకు వచ్చినట్టు? మీ రాష్ట్ర అధికారులను పంపించండి మనం మనం కూర్చుని మాట్లాడుకుందాం. అంటూ బతిమాలడం ఎందుకు? చర్చచేయొద్దని టీడీపీ ఎంపీలను ప్రాధేయ పడడం ఎందుకు? వీటికి సమాధానం చెప్పాల్సిన రాష్ట్ర బీజేపీ నేతలు వితండ వాదానికి తెరదీశారు. చంద్రబాబు ప్రభుత్వంపై యుద్ధానికి దిగడం ద్వారా బీజేపీని డెవలప్ చేసుకుందామని భావిస్తున్నట్టు వీరి మాటల వల్ల తెలుస్తోంది. అందుకే ఈ లెక్కలు, గణాంకాలు తెరమీదకి వస్తున్నాయి. నిజానికి ఇలా కనుక వాళ్లు భావిస్తే.. పూర్తిగా పక్కదారి పట్టినట్టే అంటున్నారు విశ్లేషకులు.
పరాన్న జీవిగానే......
ఏపీలో బీజేపీ ఇప్పటి వరకు కేడర్ స్థాయిలో డెవలప్ కాలేదు. ఇంకా టీడీపీపైనే ఆధారపడి పరాన్నజీవిగానే గడుపుతోంది. కేంద్రం నిజంగానే నిధులు ఇచ్చి ఉంటే.. ప్రధాని మోడీనే గొప్పగా పార్లమెంటులో ప్రకటించుకుని డప్పు కొట్టుకుని ఉండేవారు. కానీ, ఆయన అలా ఒక్కమాట కూడా చెప్పుకోలేదు. దీనిని నిశితంగా తెలుగు ప్రజలు గమనించారు. కాబట్టి ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు ఎంతగా ఫైరైనా వారి శ్రమ వృథా పైగా.. చంద్రబాబు సాధించిన సింపతీ ముందు వీరి చేస్తున్నవి కేవలం ఆరోపణలు, ఆయనను ఇబ్బందిపెట్టేవిగానే ప్రజలు భావిస్తున్నారు.
బీజేపీకి లాభం చేకూరుస్తాయా?
ఈ పరిణామాలు మున్ముందు బీజేపీకి మరింత చేటు తెచ్చేవే. ఇప్పటికి రెండు చోట్ల ఎంపీలు, ఓ నాలుగు అసెంబ్లీ సీట్లయినా గెలుచుకున్న పార్టీ వచ్చే ఎన్నికల్లో వీటిని కూడా కోల్పోయే అవకాశం మెండుగా ఉందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీ పరిస్థితి మరో కమ్యూనిస్టు పార్టీ కావడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. మరి సోము వీర్రాజు లాంటి ఉద్ధండులమని చెప్పుకొనే కాషాయ దళం ఈ నిజాన్ని గుర్తిస్తే.. మంచిదని హితవు పలుకుతున్నారు. మరి గుర్తిస్తారా? లేక వితండ వాదంతో పుట్టి ముంచుకుంటారా ? చూడాలి.
- Tags
- బీజేపీ

