కమలంపై కసి పెరిగి

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై నిత్యం ఫైర్ అవుతూనే ఉంటారు. కమలనాధులపై కసిని ఆమె ఎప్పటికప్పుడు తీర్చుకుంటూనే ఉంటారు. తాజాగా కమలనాధులకు 2019 ఎన్నికల్లో ఓటమి తప్పదని శాపనార్థాలు పెట్టారు. త్రిపుర లాంటి చిన్న రాష్ఠ్రాన్ని గెలవడానికి బీజేపీ కేంద్ర బలగాలను ఉపయోగించిందని, పెద్దమొత్తంలో డబ్బులను డంప్ చేసిందని మమత ఆరోపించారు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం వల్లనే త్రిపురలో బీజేపీకి గెలుపు సాధ్యమయిందన్నారు.
ఆ ఎన్నికలను చూసి....
త్రిపురులో గెలుపు చూసి విర్రవీగడం చూస్తుంటే నవ్వొస్తందన్నారు మమత. బెంగాల్ జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీజేపీ బెంగాల్ రాష్ట్రంపై కన్నేసిందని, అయితే వారి ప్రయత్నాలను బెంగాలీలు తెలివిగా తిప్పికొడతారన్న నమ్మకం తనకుందన్నారు. త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునన్నారు. బీజేపీయే దానికి బాధ్యత వహించాలని చెప్పారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఎన్నికల ఫలితాలను చూసైనా ఇంకా కళ్లు తెరవరా? అని మమత ప్రశ్నించారు.
అందరూ ఏకంకావాలి....
అంతేకాదు మమత ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికలకు అన్ని ప్రాంతీయ పార్టీలు కలిస్తే బీజేపీని సులువుగా ఇంటికి సాగనంపేయ వచ్చని బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఎన్డీఏలోని టీడీపీ, శివసేన వంటి పార్టీలు బయటకు వచ్చిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. మోడీ దెబ్బకు అక్కడ ఎవరూ ఉండలేరన్నారు. నియంతలా వ్యవహరిస్తే తాము ఎలా మెడలు వంచాలో తెలుసునన్నారు. ఇటీవల కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదన తెచ్చినప్పుడు మమత వెంటనే స్పందించి కేసీఆర్ కు ఫోన్ చేసి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. మొత్తం మీద దీదీ కమలం పార్టీపై కసితో రగిలిపోతున్నారు.
- Tags
- మమత బెనర్జీ
