కమలం పార్టీ అనుకున్నది సాధిస్తుందా?

నిన్న మొన్నటి వరకూ గుజరాత్ పర్యటనల్లో బిజీగా ఉన్న ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు కర్ణాటకపై కూడా కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కర్ణాటకలో విజయం సాధించాలని భావిస్తున్న కమలనాధులు అందుకు అనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఆదివారం కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటన చేశారు. మొత్తం నాలుగు చోట్ల జరిగిన సభల్లో ఆయన ప్రసంగించారు. తొలుత ధర్మస్థలిలోని మంజునాధ స్వామిని దర్శించుకున్న అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. తర్వాత బెంగుళూరుకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. తర్వాత బీదర్ లోనూ పర్యటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాదిన నిలదొక్కుకునేందుకు కర్ణాటకను కమలం పార్టీ ఎంచుకుంది.
మోడీ పర్యటనతో.....
ఇప్పటికే కర్ణాటక బీజేపీ రాష్ట్ర శాఖ పకడ్బందీగా కార్యాచరణను రూపొందించుకుంది. వచ్చే నెల 2వ తేదీ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప 7500 కిలోమీటర్ల ప్రచార యాత్ర ప్రారంభం కానుంది. దీనికి పరివర్తన యాత్రగా నామకరణం చేశారు. బీజేపీకి దక్షిణ కన్నడ ప్రాంతం, బెంగళూరు, బీదర్ వంటి ప్రాంతాల్లో ఈరోజు మోడీ పర్యటన బీజేపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. అంటే ఒకరకంగా బీజేపీ మోడీ సభలతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిందనే చెప్పాలి. మోడీ పర్యటన తర్వాత ప్రారంభమయ్యే పరివర్తన ర్యాలీకి కమలనాధులు రెడీ అవుతున్నారు. దీంతో కన్నడ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి ప్రారంభమైంది.
- Tags
- కర్ణాటక

