కఠిన నిర్ణయాలు తప్పవన్న మోడీ

అభివృద్ధితోనే అన్ని సమస్యలకు పరిష్కారమవుతాయని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. అభివృద్ధిలో ముందుండాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. జాతి పునర్నిర్మాణానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ ఎన్నికలే రుజువు చేశాయన్నారు. కొందరు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. యూపీ ఎన్నికలు, మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ఓడిపోతుందని కొందరు తప్పుడు ప్రచారంపెద్దయెత్తున చేశారన్నారు. అయినా ప్రజలు బీజేపీకి అండగా నిలిచారని చెప్పారు. గుజరాత్ లో రెండు దశాబ్దాలుగా వరుసగా గెలుస్తూ చరిత్ర సృష్టించామన్నారు. కార్యకర్తల కృషి కారణంగానే వరుస విజయాలు సాధించామన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవలేమని గుజరాత్ బీజేపీ నేతలను సున్నితంగా హెచ్చరించారు. బీజేపీపై నాలుగువైపులా దాడి చేశారన్నారు. వ్యక్తిగత ఆరోపణలతో కాంగ్రెస్ రెచ్చగొట్టిందన్నారు. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి అనుకూలంగా వస్తే సంతోషాన్ని తగ్గించేందుకు కుటిల ప్రయత్నం చేశారన్నారు. అభివృద్ధి విషయంలో విషప్రచారం చేశారన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. సబ్ కా సాత్... సబ్ కా వికాస్ బీజేపీ మంత్రమన్నారు.
- Tags
- మోడీ

