ఓటుకు నోటు కేసులో ఏసీబీ కౌంటర్ ఊహించిందే!

ఇంతకంటె భిన్నంగా తెలంగాణ ఏసీబీ మరో రకంగా కౌంటర్ దాఖలు చేస్తుందని ఎవ్వరూ ఆశించలేదు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర గురించి తక్షణం నిగ్గు తేల్చేయాల్సిందేననే డిమాండ్ తో న్యాయపోరాటం ప్రారంభించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా రుచికరమైన పరిణామం జరగలేదు. ఓటుకు నోటు కేసులో దర్యాప్తు సాగుతూనే ఉన్నదని, ఈ కేసులో కొత్తగా మరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ ఏసీబీ బుధవారం నాడు హైకోర్టుకు నివేదించింది. దీంతో చంద్రబాబు నాయుడుకు చాలా ఊరట లభించినట్లే లెక్క.
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత్రను తేల్చాలని, విచారణ ను వెంటనే పూర్తిచేయాలని, చంద్రబాబు పాత్ర గురించి తేల్చేలా ఆయన వాయిస్ ను ఫోరెన్సిక్ నివేదికలు ధ్రువీకరించిన నేపథ్యంలో మరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సీబీఐ కోర్టులో కేసు వేశారు. ఆమేరకు నాలుగు వారాల్లోగా విచారణ తేల్చేయాల్సిందే అంటూ హైకోర్టు తెలంగాణ ఏసీబీని అప్పట్లో ఆదేశించింది.
దీనికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన చంద్రబాబు విచారణను ఆపుచేయాల్సిందిగా కోరారు. హైకోర్టు విచారణను ఎనిమిది వారాలు ఆపుతూ స్టే ఇచ్చింది. దీనిపై రామకృష్ణా రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. అవినీతి కేసుల్లో స్టేలు కరెక్టు కాదంటూ.. నాలుగు వారాల్లోగా దీన్ని విచారణ చేపట్టాలని ఆదేశిస్తూ సుప్రీం ఆదేశించింది. పర్యవసానంగా హైకోర్టు బుధవారం నాడు ఆ పిటిషన్ ను విచారించింది. అయితే కేసు విచారణ సాగుతున్నదని, కొత్త ఎఫ్ఐఆర్ అవసరం లేదని తెలంగాణ ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేయడం ఇక్కడ చాలా కీలకం. దీనివల్ల చంద్రబాబుకు ఎలాంటి తలనొప్పి ఉండదని న్యాయనిపుణులు భావిస్తున్నారు.

