ఓటుకు నోటు ఆశ పెడితే.. వేటు తప్పదు!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం అయిన ఓటుకు నోటు కేసు లో రెడ్ హ్యాండెడ్ గా వ్యవహారం పట్టుబడిన ఇప్పటిదాకా కేసు విషయం తేలకపోవడానికి కారణం .. ఈ నేరానికి సంబంధించి స్పష్టమైన చట్టం లేకపోవడం. అలాంటిది.. ఓట్లకు డబ్బులు ఇవ్వజూపే వారికి రెండేళ్ల జైలు శిక్ష వంటి స్పష్టమైన శిక్షలు ప్రతిపాదిస్తూ కొత్త చట్టాలు చేయడానికి ఇప్పుడు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల సంఘం ఈ మేరకు అవినీతిని అరికట్టడానికి కొన్ని ప్రతిపాదనలను కేంద్రం ముందుంచుతోంది.
నామినేషన్ సందర్భంగా నాయకులు ఇచ్చే ఆస్తులు, నేరచరిత్ర అఫిడవిట్ లో తప్పులు చెప్పినట్లు తేలినా వారికి జైలు శిక్ష వేసేలా సిఫారసులు మార్చారు. ఓటర్లకు డబ్బు పంచినా రెండేళ్లు జైలు శిక్ష వేయాలి. నేరారోపణలు ఉన్నవారు కూడా పోటీచేయకుండా చూడాలి. ఒకరు రెండుస్థానాలనుంచి బరిలోకి దిగే పద్ధతికి స్వస్తి చెప్పాలి.. ఇలా పలు రకాల సంస్కరణల్ని ఎన్నికల సంఘం ప్రతిపాదిస్తోంది.
అయితే ఆర్థిక లావాదేవీల సంస్కరణల్లో జనానికి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా అవినీతి నియంత్రణ అనే మాట చెప్పి.. నెట్టకొస్తున్న మోదీ సర్కార్.. మరి రాజకీయ అవినీతికి కడిగేయడానికి ఈసీ ప్రతిపాదిస్తున్న సంస్కరణల విషయంలో ఎలా స్పందిస్తుంది అనేది కీలకంగా మారింది. రాజకీయ పార్టీలకు ముకుతాడు వేసే వ్యవహారంలోనూ మోదీ ఇంతే చిత్తశుద్ధిని చూపిస్తారా? లేదా? వేచిచూడాలి.

