ఓటు బ్యాంకు కనుమరుగైపోతోందా?

అపజయాలతో కుంగిపోయిన కమలనాధులకు కర్ణాటక ఎన్నికలు కంగారు పుట్టిస్తున్నాయి. ఈ ఏడాది లోనే ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఆ పార్టీ భావిస్తోంది. పైగా ప్రధాని మోడీ కూడా పార్లమెంటులో కర్ణాటక తర్వాత కాంగ్రెస్ కనుమరుగవుతుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఎలాగైనా పాగా వేయాలని కమలం పార్టీ ప్రయత్నిస్తుండగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు షాకిచ్చాయి. ఉత్తరప్రదేశ్ లో జరిగిన రెండు, బీహార్ లో జరిగిన ఒక లోక్ సభ స్థానాన్ని కమలం పార్టీ కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు అక్కడ ఓట్ల శాతం గణనీయంగా తగ్గడం కమలనాధుల్లో కలవరం బయలుదేరింది.
ఎంత తగ్గింది?
2014 ఎన్నికలకు, నిన్న జరిగిన ఎన్నికలకు చాలా మార్పు వచ్చింది. ఫూల్ పూర్ నియోజకవర్గం లో 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 52.43 శాతం రాగా, సమాజ్ వాదీ పార్టీకి 20. 3, బీఎస్పీకి 17.1 శాతం ఓట్లు వచ్చాయి. అదే తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 38.81 శాతం ఓట్లు రాగా, సమాజ్ వాదీ పార్టీకి 46.95 శాతం ఓట్లు లభించాయి. అంటే ఈ నియోజకవర్గంలో దాదాపు 13.62 శాతం ఓట్లు తగ్గిపోయాయి. సమాజ్ వాదీ పార్టీకి 26.65 శాతం ఓట్లు పెరిగాయి. అయితే ఇక్కడ సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ కలిసి పోటీ చేయడం గమనార్హం.
గొరఖ్ పూర్ లోనూ....
ఇక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కు పట్టున్న గొరఖ్ పూర్ నియోజకవర్గం తీసుకుంటే 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 2014 ఎన్నికల్లో 51.8 శాతం ఓట్లు రాగా సమాజ్ వాదీ పార్టీకి 21.8, బహుజన్ సమాజ్ పార్టీకి 17 శాతం ఓట్లు వచ్చాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఇదే గొరఖ్ పూర్ నియోజకవర్గంలో బీజేపీకి 46.53 శాతం ఓట్లురాగా, ఎస్పీకి 48.87 శాతం ఓట్లు వచ్చాయి. అంటే గత ఎన్నికల కంటే 5.27 శాతం ఓట్లు తగ్గాయి. ఇక బీహార్ లోని అరారియా లోక్ సభ నియోజకవర్గంలోనూ 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 26.8 శాతం ఓట్లు రాగా, ఆర్.జె.డికి 41.8 శాతం ఓట్లు వచ్చాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 43.2 శాతం ఓట్లు రాగా ఆర్జేడీకి 49. 2 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ, జేడీయూ అధికారంలో ఉన్న బీహార్ రాష్ట్రంలో లాలూయాదవ్ పార్టీ దాదాపు ఎనిమిది శాతం ఓట్లను పెంచుకోగలిగింది.
కన్నడనాట కూడా....
ఇలా ఓట్ల శాతం తగ్గుతుండటంతో కమలనాధుల్లో ఆందోళన పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్ ఎఫెక్ట కర్ణాటకలో పడుతుందేమోనని బీజేపీ నేతలు కొంత కంగారు పడుతున్నారు. ఉత్తరాదిలో బలంగా ఉన్న చోటనే ఓట్ల శాతం తగ్గుముఖం పడుతుంటే కర్ణాటక లాంటి దక్షిణాది రాష్ట్రంలో గెలుపు కొంత కష్టమేనన్నది విశ్లేషకుల అంచనా. కర్ణాటకలో కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికల తర్వాత మరింత జోరు పెంచింది. మోడీకి ఎదురుగాలి ప్రారంభమయిందని ప్రచారం ప్రారంభించేశారు. కర్ణాటక బీజేపీ శ్రేణుల్లోనూ యూపీ ఎన్నికల ఫలితాలు కంగాళీ చేస్తున్నాయి. మొత్తం మీద యూపీ దెబ్బను ఇంకా మర్చిపోలేకపోతున్నారు కమలనాధులు. అదే తప్పు కర్ణాటకలో జరగకుండా ఉండేందుకు చర్యలు ప్రారంభించారు.
- Tags
- బీజేపీ
