ఒలింపిక్స్ పెట్టకుండా చంద్రబాబు వదిలేలా లేరు!

తెలుగు అమ్మాయి పీవీసింధు పతకం కూడా సాధించడంతో ఒలింపిక్స్ అనే మాట మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజుల పాటూ చాలా ముమ్మరంగా వినిపించింది. ఆ సందర్భంలో చంద్రబాబునాయుడు ఒక అడుగు ముందుకు వేసి, వచ్చే ఒలింపిక్స్ కాకుండా, ఆ తర్వాతి ఒలింపిక్స్ ను అమరావతి నగరంలో నిర్వహిస్తామని ప్రకటించేశారు. దీనికి సంబంధించి ఇప్పటినుంచే ప్రణాళిక సిద్ధం చేస్తాం అని కూడా చెప్పారు. అయితే.. అప్పటికి ఏదో ఒలింపిక్స్ సీజన్ నడుస్తున్నది గనుక.. చంద్రబాబునాయుడు సీజనల్ గా చెప్పిన రాజకీయ డైలాగు మాత్రమే అది.. అని అంతా అనుకున్నారు.
కానీ వాస్తవంలో గమనిస్తే చంద్రబాబునాయుడు అమరావతి నగరంలో ఒలింపిక్స్ నిర్వహించకుండా ఊరుకునేలా కనిపించడం లేదు. ఒలింపిక్స్ నిర్వహణకు అనువుగా క్రీడావేదికలు నిర్మించడం గురించి.. మౌలిక వనరుల కల్పన కంటె ముందునుంచే ఆయన సీరియస్ కసరత్తు చేస్తున్నారు. బుధవారం అమరావతి నగరానికి సంబంధించిన పనుల సమీక్ష సమావేశంలో ఒలింపిక్ నగర నిర్మాణంలోని అనుభవజ్ఞులను కూడా పిలిపించి మాట్లాడడం ఇందుకు నిదర్శనం.
ఈ సమావేశంలో బార్సిలోనా నగర వైస్ మేయర్ ఆంథోని పాల్గొని ఒలింపిక్ క్రీడా గ్రామం ఏర్పాటులో తమ అనుభవాలను వివరించారు. రానున్న కాలంలో అమరావతిని ఒలింపిక్స్ వేదికగా రూపొందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు తలపెట్టామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. విశ్వ క్రీడా వేదికగా నిలిచేలా అమరావతిలో క్రీడా సదుపాయాలు వుండాలని అన్నారు. కేవలం మౌలిక సౌకర్యాలు కల్పించడంతో సరిపెట్టకుండా నగరంలో వుండే బాలబాలికల్లో ఫిజికల్ ఫిట్నెస్, క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా మైండ్సెట్ మార్చాల్సివుందని చెప్పారు.
సమావేశానికి బార్సిలోనా వైస్ మేయర్ ను పిలిపించడంలోనే ఒలింపిక్స్ అనే వాటిపట్ల చంద్రబాబు ఎంతో పట్టుదలగా ఉన్నారనే సంకేతం అందుతోంది. ప్రత్యేకించి ఒలింపిక్స్ నే టార్గెట్ చేస్తున్నారా? లేదా, ఆ ప్రమాణాలతో.. క్రీడా ప్రాంగణాలను అమరావతి నగరంలో నిర్మించదలచుకున్నారా? అనేది మాత్రం వేచిచూస్తే తప్ప తెలియదు.

