ఒక టిక్కెట్.. ముగ్గురు ఉద్దండుల మధ్య పోటీ...!

ముగ్గురూ...ఉద్దండులే. కాకలు తీరిన నేతలే. కాని ఒకే నియోజకవర్గంపై కన్నేయడం ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలకు కన్ ఫ్యూజన్ కు గురిచేస్తోంది. ఎవరికి వారే తమకే టిక్కెట్ అంటూ నియోజకవర్గంలో కలియదిరుగుతున్నారు. అదే భూపాలపల్లి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన మధుసూధనాచారి స్పీకర్ గా ఉన్నారు. ఆయన తనకున్న పరిచయాలతో నియోజకవర్గానికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు తెస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మధుసూధనాచారికి టిక్కెట్ కేసీఆర్ ఇవ్వరని, ఆయనను పెద్దల సభకు పంపుతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.
కుమారులే మైనస్....
మధుసూధనాచారికి ఆయన తనయులే పెద్ద మైనస్ గా మారారు. ముగ్గురు కుమారులు తలా రెండేసీ మండలాలను పర్యవేక్షిస్తూ పెత్తనం చెలాయిస్తున్నారు. సింగరేణి ఎన్నికల్లోనూ, గణపురం మత్స్యశాఖ ఎన్నికల్లో ఓటమికి కారణం మధుసూధనాచారి తనయుల వైఖరి కారణమన్న బహిరంగ వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. సింగరేణి ఎన్నికలలో అక్కడ ఓటమికి మధుసూధనాచారి తనయులే కారణమని పరిశీలకులుగా వెళ్లిన ఎంపీలు వినోద్ కుమార్, పసునూరి దయాకర్ లు, టీఆర్ఎస్ నేత పెద్దిసుదర్శన్ రెడ్డి కేసీఆర్ కు నివేదిక కూడా ఇచ్చారని సమాచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో స్పీకర్ కు ఇక్కట టిక్కెట్ ఇవ్వరన్నది దాదాపుగా తేలిపోయిందంటున్నారు గులాబీ పార్టీ నేతలు.
గండ్ర గ్రౌండ్ వర్క్....
ఇక ఇటీవలే టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన గండ్రసత్యనారాయణకు టిక్కెట్ పై హామీ లభించిందంటున్నారు. ఆయన నియోజకవర్గంలో గుర్తింపు ఉన్న నేత. దీంతో గండ్ర సత్యనారాయణ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తనకంటూ ఒక వర్గాన్ని కూడా గండ్ర ఏర్పాటు చేసుకున్నారు. టిక్కెట్ వచ్చే ఎన్నికల్లో తనదేనన్న ధీమాను అనుచరుల వద్ద గండ్ర వ్యక్తం చేస్తున్నారు. గండ్ర యాక్టివ్ కావడంతో ఆయనకే టిక్కెట్ అని కొందరు కార్యకర్తలు ఆయన వెంట తిరుగుతున్నారు.
కొండా రూటు సపరేటు...
ఇక ఎమ్మెల్సీ కొండా మురళి. ఆయన కూడా భూపాలపల్లి నియోజకవర్గంపై కన్నేశారు. శాసనసభకు వెళ్లాలన్నది కొండా మురళి ఆలోచన. ఇందుకు సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కొండా హాజరవుతున్నారు. పేదలకు బట్టల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన చిన్న చిన్న కార్యక్రమాలకు హాజరవుతూ వచ్చే వన్నీ మన రోజులే నంటూ కార్యకర్తలకు చెబుతుండటంతో కొండా ఈసారి ఈ టిక్కెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది. మొత్తం మీద ఒక నియోజకవర్గంలో ముగ్గురు నేతలు సీటుపై కన్నేయడంతో కార్యకర్తల్లో ఆందోళన మొదలయిందంటున్నారు. మరి టిక్కెట్ చివరికి ఎవరికి ఇస్తారో గులాబీ బాస్ కే తెలియాలి.

