ఏమయ్యా...బాలరాజూ...ఏమి సెప్తివి...ఏమి సెప్తివి...!

వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలోకి చేరడానికి కారణం మాజీ మంత్రి బాలరాజు. ఆయన వైసీపీలోకి వస్తున్నారని తెలియడంతోనే గిడ్డి ఈశ్వరి పార్టీని వీడారు. మాజీమంత్రి బాలరాజుకు వచ్చే ఎన్నికల్లో పాడేరు శాసనసభ టిక్కెట్ ఇస్తారని తెలియడంతో ఈశ్వరి మనస్తాపానికి గురై పార్టీని వీడారు. కాని మాజీ మంత్రి బాలరాజు మాత్రం తాను ఇప్పటికీ కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నానని చెబుతున్నారు. కాంగ్రెస్ తో తనకు మంచి గౌరవం ఉందని, సముచితమైన స్థానం ఉందని అన్నారాయన. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని చెప్పారు బాలరాజు.
అసత్య ప్రచారమే....!
తాను పార్టీ మారుతున్నట్లు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారన్న బాలరాజు, తనకు పార్టీ మారే ఆలోచన ఏమీ లేదన్నారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ మారడాన్ని తాను తప్పుపట్టడం లేదన్నారు. అయితే పార్టీ మారుతూ అవతలి వారిపై బురద జల్లడం తప్పన్నారు. టీడీపీకి శాసనసభలో పూర్తిగా బలం ఉన్నా..ఇంకా వలసలను ప్రోత్సహించడమేంటని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో గిరిజనులకు ఎలాంటి న్యాయం జరగలేదని బాలరాజు అభిప్రాయపడ్డారు. మరి గిడ్డి ఈశ్వరి పార్టీ ఎందుకు మారినట్లో....!
- Tags
- బాలరాజు

