ఏపీలో బీజేపీ ఏం ఆశిస్తోంది.... దాని రేంజ్ ఎంత..!

అవును! గడిచిన రెండు రోజులుగా ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పొత్తు పెట్టుకుని కూడా బీజేపీని ఎదగనివ్వడం లేదని, టీడీపీ నిజానికి బీజేపీకి శత్రువు కన్నా ఎక్కువని ఆయన పదే పదే విమర్శలు సంధిస్తున్నారు. గుజరాత్ ఎన్నికల్లో గెలుస్తుందని భావించిన కాంగ్రెస్ చతికిల పడడం, ఓడిపోతుందని గట్టిగా నిర్ణయించుకున్న బీజేపీ జయకేతనం ఎగురవేయడంతో సోము వ్యాఖ్యలు పదును తేలాయి. దమ్ముంటే బీజేపీతో పొత్తును కాదండి, తెంచుకోండి అంటూ సోము సవాలు కూడా రువ్వారు. గత కొన్నాళ్లుగా సోము వీర్రాజు, పురందేశ్వరి, కావూరి సాంబశివరావు వంటి బీజేపీ నేతలు టీడీపీపై విమర్శలు సంధిస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులు సహా రాజధాని నిధులు, లోటు బడ్జెట్ నిధులు,వివిధ పథకాలకు పెడుతున్న పేర్లు వంటి విషయాలను ప్రధానంగా ప్రస్తావిస్తు విమర్శలు ఎక్కు పెడుతూనే ఉన్నారు.
కావాలనే వ్యాఖ్యలు చేశారా?
అయితే, వీరందరిలోకీ సోము వీర్రాజు నాలుగడుగులు ముందుకు వేశారు. తాజాగా గుజరాత్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన విమర్శలు మరింత జోరుగా సాగుతున్నాయి. చంద్రబాబునే టార్గెట్ చేస్తూ ఆయన చేస్తున్న విమర్శలపై సహజంగానే టీడీపీ నేతలు ప్రతి విమర్శలు చేయడం సహజం. అయితే, చంద్రబాబు మాత్రం అలా చేయొద్దంటూ.. బాబు తన పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సోము వ్యాఖ్యలపై ఎవరూ స్పందించడం లేదు. వాస్తవానికి సోము వీర్రాజు చేస్తున్న విమర్శలు నిర్మాణాత్మకమేనా? లేక ఏదో అనాలి కాబట్టి అలా అనేస్తున్నాడా? గుజరాత్ ఎన్నికల ఫలితం ఏపీలో రిపీట్ అవుతుందని భావిస్తున్నాడా? అనే దిశగా ఇప్పుడు విశ్లేషకులు దృష్టి పెట్టారు.
అది భ్రమే అవుతుందని....
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసి… దేశమంతా నెమ్మదిగా కాషాయమయం అవుతోంది కాబట్టి, ఏపీలో కూడా అదే జరిగిపోతుందని సోము వీర్రాజు అనుకుంటే, అది భ్రమే అవుతుందని అంటున్నారు. నిజానికి ఆయా రాష్ట్రాల్లో ఉన్న బలం బీజేపీకి ఏపీలో ఎక్కడా కనిపించదు. ఇక్కడ హిందుత్వ లాంటి అంశాలు బలంగా పనిచేసే పరిస్థితి లేదు. మోడీ మేనియా కూడా కొంతవరకే ప్రభావితం చేస్తుందేమో అది కూడా చెప్పలేం. ఇక్కడున్న కుల సమీకరణాలు బీజేపీకి అర్థమయ్యే పరస్థితి కనిపించడం లేదు. కాబట్టి, వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తు తప్పదు. మరోసారి టీడీపీతో పొత్తు వద్దనేది వీర్రాజు అభిప్రాయం అయినప్పటికీ… దీర్ఘకాలిక పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆలోచిస్తే, టీడీపీని బీజేపీ జాతీయ నాయకత్వం ఎప్పటికీ దూరం చేసుకోదు.
ఇంకా వీక్ చేసుకోవడానికేనా?
టీడీపీ కూడాబీజేపీని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోదు. మరి పరిస్థితి ఇలా ఉంటే సోము ఆవేశం పడడంలో అర్ధం లేదు. ఏదైనా చంద్రబాబు చెప్పినట్టు.. ప్రశాంతంగా ఆలోచించి సమస్యలను పరిష్కరించుకవాలే కానీ, ఇలా రగడం చేసుకుంటే వచ్చే ప్రయోజనం ఏంటో సోము ఆలోచించుకోవాలి. అంతో ఇంతో బలంగా ఉన్న తెలంగాణలోనే బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. పోయేవారే తప్ప వచ్చేవారు లేకుండా ఈగలు తోలుకుంటున్నారు. మరి అసలే అంతంత మాత్రంగా ఉన్న ఏపీలో ఇలా వీక్ చేసుకుంటే పరిస్థితి ఏంటి? సోము లాంటి సీనియర్‌కు ఆవేశం కాదు.. ఆలోచన ఉండాలి అంటున్నారు విశ్లేషకులు.
- Tags
- ఏపీ బీజేపీ

