ఏపీలో జినోమిక్ త్వరలో వైద్య విప్లవం

రాష్ట్రంలో జెనిమిక్ మెడిసిన్ ప్రాజెక్టు స్థాపనకు జీనోమ్ (GENOME) ఫౌండేషన్ ముందుకువచ్చింది. ‘అందరికీ ఆరోగ్యం’ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి సహకారం అందించటానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. మంగళవారం జీనోమ్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లాల్జీ సింగ్ సీఎంఓలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో జన్యు సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు అధికంగా ఉన్నారని డా. లాల్జీ సింగ్ వివరించారు.
భవిష్యత్తు వైద్యం జన్యువైద్యానిదే అవుతుందని, వ్యక్తిగత, జన్యు రికార్డును అనుసరించే ఔషధాల తయారీ ఉంటుందని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండేలా, డి.ఎన్.ఏ టెక్నాలజీ జనెటిక్ డయాగ్నాస్టిక్ సర్వీసులు, జనెటిక్ వైద్య సేవలు అందజేస్తామని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. రూ. 10 నుంచి 15 కోట్ల వ్యయం కాగల ప్రధాన జినోమిక్స్ కేంద్రం స్థాపనకు తమకు రెండెకరాల స్థలం కేటాయించాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. గ్రామీణ ప్రాంతాలలో అనుబంధ కేంద్రాలను నెలకొల్పుతామన్నారు.
తమ ప్రతిపాదనలకు అంగీకరిస్తే దేశంలో జినోమిక్ మెడిసిన్‌ను, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖతో అనుసంధానించిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుందని లాల్జీ సింగ్ చెప్పారు. వ్యక్తి జన్యు చరిత్ర ఆధారంగానే వ్యాధులు ఉంటాయని, డయాబెటిక్స్, హైపర్ టెన్షన్, గుండె ధమనుల్లో రక్తం గడ్డకట్టే సమస్యలకు జన్యు కారణాలున్నాయన్నారు. వ్యాధులు రాకుండా నివారించటానికి జన్యు ఔషధ చికిత్స తోడ్పడుతుందని డా. లాల్జీసింగ్ చెప్పారు.
జెనెటిక్ డయాగ్నసిస్ వల్ల తల్లి గర్భంలో ఉండగానే శిశువు ఆరోగ్య పరిస్థితిని వెంటనే తెలుసుకోవచ్చని తెలిపారు. మాలిక్యులర్ (పరమాణు) పద్ధతిలో వ్యాధినిర్ధారణతో అనర్ధాలను తగ్గించవచ్చని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జెనిమిక్ మెడిసిన్ ప్రాజెక్టు స్థాపన ప్రతిపాదనను పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సవివర ప్రతిపాదనలతో వస్తే చర్చిద్దామని చెప్పారు.

