‘ఏపీ పర్సు’ను ప్రారంభించిన చంద్రబాబు!

చంద్రబాబు తాను హైటెక్ ముఖ్యమంత్రిని అని మరోమారు నిరూపించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోకి టెక్నాలజీని పరిచయం చేసిన పాలకుడిగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలను డిజిటల్ లావాదేవీలవైపు ప్రోత్సహించడం లక్ష్యంగా ‘ఏపీ పర్సు’ యాప్ ను మంగళవారం నాడే ప్రారంభించడం విశేషం. 23 బ్యాంకులు ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు.
ప్రజలను డిజిటల్ లావాదేవీల వైపు తీసుకువెళ్లేలా ప్రభుత్వం తరఫునే యాప్ లను రూపొందించి వారికి అందుబాటులో ఉంచడానికి తెలుగు రాష్ట్రాలు ఒక రకంగా పోటీ పడ్డాయనే చెప్పాలి. తెలంగాణ వ్యాలెట్ ను తాము రూపొందిస్తామని కేసీఆర్ ప్రకటించిన మరు రోజున చంద్రబాబు ‘ఏపీ పర్సు’ అనే యాప్ ను చేయబోతున్నట్లు చెప్పారు. ఆ నేపథ్యంలో మంగళవారం కేసీఆర్ , ఈ నెల 14న టీ వ్యాలెట్ ఆవిష్కారం ఉంటుందని చెబుతుండగా.. ఈరోజే సాయంత్రానికి చంద్రబాబు విజయవాడలో యాప్ ను ఆవిష్కరించేశారు. దేశాన్నంతా డిజిటల్ ఆర్థిక లావాదేవీల వైపు తీసుకువెళ్లే సూచనలు చేయడానికి.. ఏర్పాటైన ముఖ్యమంత్రుల కమిటీకి సారథి అయిన చంద్రబాబు ఢిల్లీలో 8వ తేదీన సమావేశం కావాల్సి ఉండగా.. రెండు రోజుల ముందే తన రాష్ట్రంలో యాప్ ను ఆవిష్కరించడం గమనార్హం.
‘సులభం సురక్షితం సునాయాసం’ అనే ట్యాగ్ లైన్ తో ఈ యాప్ గురించి ప్రచారం చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ యాప్ లో 23 బ్యాంకులు, పర్స్ కంపెనీలు అందుబాటులో ఉంటాయని, ప్రజల చేతిలో మొబైల్ ఫోనే, వారి బ్యాంకు అవుతుందని చంద్రబాబు ప్రకటించారు. నోట్ల రద్దు కష్టాలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని... ప్రస్తుతానికి రాష్ట్రంలో 2040 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయని కూడా ఆయన అన్నారు.
టీ వ్యాలెట్ వస్తే తప్ప చెప్పలేం...
చంద్రబాబునాయుడు తెలంగాణ కంటె వారం ముందుగా ‘ఏపీ పర్స్’ యాప్ ను ప్రారంభించినంత మాత్రాన ప్రజలకు సౌలభ్యం కలిగిచండంలో, వారికి ప్రేరణ అందించడంలో ఆయన పైచేయి సాధించినట్లు చెప్పలేం. తెలంగాణ వ్యాలెట్ కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాతే.. ఏ యాప్ ప్రజలకు ఎక్కువ సౌకర్యంగా ఉన్నదో, వారిని డిజిటల్ లావాదేవీలవైపు ప్రోత్సహించేలా ఉన్నదో చెప్పగలమని నిపుణులు అంటున్నారు.

