ఏపీ, తెలంగాణపై హైకోర్టు సీరియస్...!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు హైకోర్టు షాకిచ్చింది. వివిధ అవసరాల కోసం భూసేకరణ జరుపుతూ తీవ్ర జాప్యం చేస్తుండటంపై న్యాయస్థానం మండిపడింది. పరిహారం కోసం బాధితులు కోర్టులు మెట్లు ఎక్కినా... పరిహారం చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా ఎందుకు చెల్లించడం లేదని నిలదీసింది. కోర్టు ఆదేశాలంటే ప్రభుత్వాలకు పెద్ద జోక్ గా మారిపోయిందని అభిప్రాయపడింది. దేవాలయ భూములను స్వాధీనం చేసుకోవాలంటే ముందుగా పరిహారాన్ని డిపాజిట్ చేయాలన్న ఉత్తర్వులను మిగిలిన భూసేకరణలో కూడా ఇస్తామని స్పష్టం చేసింది.
పరిహారం చెల్లించకపోవడమే....
పరిహారం చెల్లించకుంటే భూసేకరణను నిలిపివేసేలా ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయస్థానం హెచ్చరించింది. భూసేకరణ పరిహారం చెల్లింపు విషయంలో ఇప్పటి వరకూ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఏ మేరకు అమలు పర్చారో పూర్తి స్థాయి నివేదికను అందజేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శులను ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలు ఒక జిల్లా జడ్జి లేఖతో వెలువడ్డాయి. భూసేకరణ పరిహారం విషయంలో తాము జారీ చేస్తున్న ఉత్తర్వులను కలెక్టర్లు అమలు పర్చడం లేదని మహబూబ్ నగర్ జిల్లా జడ్జి ఉమ్మడి హైకోర్టు లేఖ రాయడంపై హైకోర్టు సీరియస్ అయింది. జడ్జి లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణిస్తున్నామని పేర్కొంది. ప్రభుత్వాల వైఖరి కారణంగా వేలకొద్దీ వ్యాజ్యాలుకోర్టుల్లో పేరుకుపోతున్నాయంది. భూసేకరణ విషయంలో వివిధ న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులు ఏమేరకు అమలయ్యాయో పూర్తి స్థాయి వివరాలను సమర్పించాలని రెండు ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.
- Tags
- హైకోర్టు

