ఏపీ కోసం ముష్టెత్తుతా అంటున్న వెంకయ్య

వెంకయ్యనాయుడు తన మీద జనంలో వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి పాట్లు పడడం ఇంకా మానలేదు. తాను ఏపీకి నష్టం చేయలేదని, మంచే చేస్తున్నానని నమ్మించడానికి ఆయన పడుతున్న కష్టాలు చూస్తోంటే ఒకరకంగా జాలి కలుగుతోంది. కేంద్రం హోదా విషయంలో ఏపీని వంచించిందనే విషయంలో ఎవరికీ ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. అయితే.. కేంద్రం చాలా ఉదారంగా ఆదుకుంటున్నదని.. జనాలకు చాటిచెప్పాలనేది వెంకయ్య ప్రయత్నం. అందుకే ఆయన తాను ఏపీకోసం ముష్టెత్తి ఆ సొమ్ము తెచ్చి అభివ్రుద్ధి పనులకు ఖర్చు చేస్తా అంటున్నారు. ( ఈ డైలాగుకు కండిషన్స్ అప్లయి అవుతాయండోయ్)
పోలవరం జాతీయ ప్రాజెక్టే అయినా కేవలం వంద కోట్ల నిధులు ఇవ్వడంపై ముష్టి వేశారంటూ గతంలో చాలా విమర్శలు వచ్చాయి. నిజానికి వారు ప్రకటించిన ప్యాకేజీ కూడా వీరముష్టి ప్యాకేజీ అనే విమర్శలున్నాయి. ఈ విమర్శలు వెంకయ్యను బాధించినట్లుంది. అందుకే తనలోని ఉక్రోషాన్ని ఓ టీవీ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
పోలవరానికి నిధులు ఇస్తే దాన్ని వంద కోట్లను ముష్టి అని కొందరు అన్నారు. ఎన్ని వేల కోట్లు స్వాహా చేసిన వాళ్లయితే, వంద కోట్లను ముష్టి అనగలరు? అంటూ వెంకయ్య కొత్త భాష్యం చెబుతున్నారు. ముష్టిగా వంద కోట్లు వచ్చేట్లయితే తాను రోజూ ముష్టెత్తి వచ్చే సొమ్మును ఏపీ కోసం వెచ్చిస్తానని కూడా ప్రకటించేశారు.
తన మీద ప్రత్యర్థులు వెటకారాలకు, కౌంటర్ వెటకారాల్లో వెంకయ్యనాయుడు దిట్ట. అయినా మరి, వందకోట్లు ముష్టి వచ్చేట్లయితే.. తమరెళ్లి ముష్టెత్తి ప్రజలకోసం దాన్ని త్యాగం చేసే బదులు, ప్రజలకే ఆ చిరునామా చెబితే సరిపోతుందిగా వెంకయ్యగారూ.

