ఎస్బీఐ దూకుడు : 7వేల కోట్ల బడా బకాయిలు రద్దు!

ఒకవైపు బడాబాబులు, నల్ల కుబేరుల తాట తీయడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండగా.. బడాబాబుల మొండి బకాయిల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం నాడు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. బిగ్ షాట్స్ గా సమాజంలో చెలామణీ అవుతూ, పెద్ద మొత్తాల్లో బ్యాంకుకు బకాయి పడి, డిఫాల్టర్లుగా మారిన వారి రుణాలను ఏకంగా రద్దు చేసి పారేసింది. మొత్తం 63 మంది పెద్ద పెద్ద డిఫాల్టర్లకు సంబంధించిన 7వేల కోట్ల రూపాయల రుణాలు రద్దయిన వాటిలో ఉన్నాయి. సామాన్యులు వేలల్లోనో, ఒకటి రెండు లక్షల్లోనో రుణం తీసుకుంటే.. వారికి రుణం ఇవ్వడానికి, అలాగే తిరిగి వసూలు చేయడానికి రాచి రంపాన పెట్టే బ్యాంకులు.. సంపదలో తులతూగుతూ ఉండే నల్లకుబేరులకు ఇతోధికంగా సేవ చేయడానికా అన్నట్లుగా ఇలా ఒకేసారి 7 వేల కోట్ల రూపాయల బకాయిలను రద్దు చేసేయడం సామాన్యుడికి షాక్ కలిగించే అంశం.
రద్దయిపోయిన బకాయిల్లో లిక్కర్ కింగ్ విజయమాల్యాకు చెందిన రుణాలే 1200 కోట్లు ఉన్నాయి. ఇంకా అలాంటి పెద్ద మొత్తాల్లో రుణాలనుంచి మొండిగా ఎగవేయడం వలన, ఇవాళ విముక్తి పొందిన బడాబాబుల్లో ఏపీకి చెందిన ఘన్శ్యామ్ జ్యువెల్స్, విక్టరీ ఎలక్ట్రికల్స్, విక్టరీ స్విచ్ అండ్ గేర్స్, కేఆర్ ఆర్ ఇన్ఫ్రా, తెలంగాణకు చెందిన తోతమ్ ఇన్ఫ్రా, ఎస్ ఎస్ జీ ఇంజినీరింగ్ లిమిటెడ్ తదితర సంస్థలు ఉన్నాయి.
బడాబాబుల మొండి బకాయిలను వసూలు చేయడంలో వ్యవహారాలేమిటో సామాన్యులకు అర్థమయ్యే స్థాయిలో ఉండకపోవచ్చు గానీ.. ఒకవైపు దేశంలో ఒకటి రెండు వేల రూపాయలను మార్చుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకోవడానికి, కొత్త నోట్లు తీసుకోవడానికి సామాన్యులు ఒక్కోసారి ఒకటి రెండు రోజులు పాట్లు పడుతున్న తరుణంలో.. ఏకంగా.. 7వేల కోట్ల రూపాయల బడా రుణాలను బ్యాంకు మాఫీ చేసేయడం అనేది చాలా పెద్ద పరిణామంగా జనం మాట్లాడుకుంటున్నారు.

