ఎర్రజెండా పోయి...గులాబీ జెండా వస్తుందా?

మావోయిస్టు మాజీ నేత జంపన్న గులాబీ గూటికి చేరబోతున్నారా? అవును... ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే జంపన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసి పోయారు. ఆయనపేర కోటి రూపాయల రివార్డు ఉంది. జంపన్న లొంగిపోవడానికి కూడా ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు కూడా కారణమని తెలిసింది. ఆయన ప్రోద్బలంతోనే జంపన్న లొంగిపోయాడని, ఆయనను త్వరలోనే టీఆర్ఎస్ లో చేర్చుకుంటారని చెబుతున్నారు.
తొలి నుంచి కేసీఆర్....
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలినుంచి మాజీ మావోయిస్టులను పార్టీలో చేర్చుకుంటూ వస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనూ సాంబశివుడిని చేర్చుకున్నారు. వరుసగా ఎన్ కౌంటర్లతో సర్కార్ పై వస్తున్న వ్యతిరేకతను ఆయన ఈవిధంగా పోగొట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ మాజీ మావోలు బోడిగ శోభ, వీరేశం వంటి వారికి టిక్కెట్లు ఇవ్వడంతో ఎమ్మెల్యేలుగా గెలిచారు. సాంబశివుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే.
పాలకుర్తి స్థానానికి...
అయితే సెంట్రల్ కమిటీ సభ్యుడుగా పనిచేసిన జంపన్న అలియాస్ జీనుగు నర్సింహారెడ్డిని ఎన్నికల బరిలోకి దించాలన్నది కేసీఆర్ వ్యూహంగా ఉంది. ఈ మేరకు ఆయనకు టిక్కెట్ హామీ కూడా లభించినట్లు చెబుతున్నారు. అయితే జంపన్న సొంత నియోజకవర్గం పాలకుర్తి. పాలకుర్తిలో ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఎర్రబెల్లి ఈసారి జనగాం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అందుకే జంపన్నను పాలకుర్తి నుంచి పోటీ చేయించి ఎర్రబెల్లిని జనగాం పంపాలన్నది ఆలోచన. జనగాంలో ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి అనేక వివాదాల్లో చిక్కుకోవడంతో ఆయనకు ఈసారి టిక్కెట్ దక్కదని గులాబీ నేతలే చెబుతున్నారు. మొత్తం మీద కేసీఆర్ మాజీ మావోయిస్టులకు అక్కునచేర్చుకుంటున్నారు. త్వరలోనే జంపన్నకు గులాబీ కండువ కప్పనున్నారు.
- Tags
- జంపన్న

