ఎమ్మెల్యేలను వణికిస్తున్న సర్వేలు...!

వామ్మో...ఇవేం సర్వేలు... ఎమ్మెల్యేలకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తున్నాయి. ఎవరు చేస్తున్నారో...తెలియదు...ఎప్పుడు చేశారో తెలియదు... ఎందుకు చేశారో తెలియదు... కాని సర్వే ఫలితాలు మాత్రం ఎమ్మెల్యేలను నిద్రపోనివ్వడం లేదు. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ ఎక్కువగా మారింది. నియోజకవర్గాల వారీగా సర్వేలు చేసి వాటి ఫలితాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో అవి నిజమో...కాదో...తేల్చుకోలేక కొందరు ఎమ్మెల్యేలు బెంబేలెత్తిపోతున్నారు.
విపరీతంగా సర్వేలు....
ఇటీవల సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఈ సర్వేలు కూడా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఈ సర్వేలు శాసనసభ్యుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. నియోజకవర్గంలో సర్వేలదే పెద్ద చర్చగా మారడంతో సర్వే చేసింది ఎవరన్న దానిపై ఎమ్మెల్యేలు కూడా సర్వే చేయడం ప్రారంభించారు. సాధారణంగా ఎన్నికలకు ముందు కొన్ని సంస్థలు సర్వేలు చేయడం, వాటి ఫలితాలను ప్రకటించడం మామూలు. కాని ఇక్కడ మాత్రం గతకొంతకాలంగా సర్వేలతో హడలెత్తిస్తున్నారు. ఇటీవల ఓయూ విద్యార్థుల పేరిట ఓ సర్వే సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఆ సర్వేని ఎవరు చేశారో కూడా తెలియదు. అధికార టీఆర్ఎస్ పార్టీకి అన్ని సీట్లు రావని ఈ సర్వే తేల్చేసింది.
వణుకుతున్న ఎమ్మెల్యేలు....
ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఈ సర్వేలు వణుకు పుట్టిస్తున్నాయి. నిరుద్యోగ యువత పేరిట ఒక సర్వే వరంగల్ జిల్లాలో జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభ్యర్థుల మెజారిటీతో సయితం ప్రకటించడంతో ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు పరుగులు తీస్తున్నారు. ఏపార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో స్పష్టంగా చెప్పడంతో ఉసూరుమంటూ ఇది నిజమా? అబద్ధమా? అని తేల్చుకునే పనిలో పడ్డారు ఎమ్మెల్యేలు. ఇప్పటి వరకూ ఓటమి ఎరుగని ఒక కీలక నేత సయితం వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలవుతారని సర్వేల్లో రావడం చూసి కొందరు లైట్ తీసుకుంటున్నారు. సర్వే అంటే నిర్దిష్టంగా చేయాల్సి ఉంటుంది. కాని ఇది ఆకతాయిల పనేనని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఈసర్వేల వెనక రాజకీయ పార్టీల నేతల ప్రమేయం ఉండి వచ్చని కూడా మరికొందరు అనుమానిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో వరుసగా వస్తున్న సర్వేలు మాత్రం నేతలను బెంబేలెత్తిస్తున్నాయని చెప్పక తప్పదు.

