ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ప్రేమంటే ఇదేనేమో ....!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏటా ప్రకటించే పద్మ అవార్డు లకు మరోసారి కూడా రాజకీయ రంగు పులుముకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్ లకు రెండు, త్రిపుర కు ప్రకటించిన మోడీ సర్కార్ తెలంగాణ రాష్ట్రానికి మొండి చెయ్యి చూపడం చర్చనీయాంశం అయ్యింది. రాష్ట్రాల వారీగా కోటాలు రాజకీయ అవసరాల నేపథ్యంలో కేంద్రంలోని ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా ఇదే తీరులో నడుస్తున్నాయి. దేశంలోనే ప్రతిష్ట్మాకం గా వివిధ రంగాల్లో వున్న విశిష్ట వ్యక్తులకు ఈ పద్మ అవార్డు లు దక్కాలి. ప్రస్తుతం ఎంపిక చేసిన వారిలో లబ్ధ ప్రతిష్టులైన వ్యక్తులు ఉన్నప్పటికీ వాస్తవంగా వివక్ష పక్షపాతం తో కూడిన లెక్కలతోనే పద్మా అవార్డులను కేంద్రం ప్రకటించడం విమర్శల పాలు కావడం రివాజుగా మారుతూ వస్తుంది.
అవార్డులు రాజకీయ అవసరాలుగా మారిన వేళ...
ఈశాన్య రాష్ట్రాలపై గతంలో వుండే చిన్న చూపు అక్కడ రాబోయే ఎన్నికలతో సీన్ మారింది. మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, మిజోరాం వంటి అతి చిన్న రాష్ట్రాలు సైతం పద్మ అవార్డుల లిస్ట్ లో చేరిపోయాయి అంటే ఓట్ల ప్రేమ అన్నదే అర్ధం అవుతుంది. ఇక ఎన్నికలు జరగబోయే కర్ణాటక అత్యధిక పురష్కారాలు అందుకోబోతున్న వారి జాబితాలో 9 దక్కడం కూడా ఓట్ల రాజకీయమనే తేల్చిచెబుతోంది. ఇక మహారాష్ట్రలోని శివసేన బిజెపితో కటీఫ్ చెప్పడంతో ఇప్పటినుంచే అక్కడ సొంతంగా పాగా వేయడానికి చూస్తున్న బిజెపి ఏకంగా 11 పద్మ పురష్కారాలు అక్కడి వారికి ఇచ్చి గౌరవించడం విమర్శలకు దారితీస్తుంది. వాస్తవానికి అక్కడ కూడా అత్యున్నత ప్రతిభా వంతులు ఉన్నప్పటికీ గతంలో వారిపై శీతకన్నే పడేది. దేశం కోసం చుట్టూ వున్న సమాజం కోసం పరితపించే ఎందరో ఇప్పటికి గుర్తింపు పొందలేదు. వారికి అంతర్జాతీయ అవార్డులు దక్కుతున్నాయి కానీ మన దేశంలో మాత్రం అవార్డు రాజకీయాలు వారికి చేదు అనుభవాలే మిగులుస్తున్నాయి.
ఎట్టకేలకు మహేంద్రుడికి పద్మభూషణ్ ...
క్రీడా రంగంలో ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని అనితర సాధ్య విజయాలు భారత్ కి అందించి యూత్ ఐకాన్ గా మారిన సంగతి అందరికి తెలిసిందే. ప్రపంచ క్రికెట్లోని అన్ని ఫార్మేట్ల లో అపూర్వ విజయాలను దేశానికి తెచ్చిపెట్టాడు ధోని. కానీ ఇప్పటివరకు ధోనికి ఒక్క పద్మం లభించకపోవడం పట్ల విమర్శల వానే నిన్నటివరకు కురిసేది. మొత్తానికి అది గుర్తించిన కేంద్రం జార్ఖండ్ డైనమేట్ కి మొత్తానికి పద్మభూషణ్ ప్రకటించింది. క్రీడా రంగంలోనే ధ్రువతారగా దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ యువ బ్యాడ్మింటన్ కెరటం కిదాంబి శ్రీకాంత్ కు పద్మశ్రీ లభించింది.
సంగీత సామ్రాట్ ఇళయ రాజా కు....
తన అపార సంగీత విజ్ఞానంతో పండితులను పామరులను నేటికీ ఉర్రుతలూగించే ఇళయ రాజా కు దేశ అత్యున్నత రెండవ పురస్కారమైన పద్మవిభూషణ్ లభించింది. ఈ అవార్డు ను ఆయన దక్షిణ భారత కీర్తిగా అభివర్ణించడం విశేషం. మహారాష్ట్ర కు చెందిన శాస్త్రవేత్త అరవింద్ గుప్తా, కేరళకు చెందిన లక్ష్మి కుట్టి, కళారంగం నుంచి మధ్యప్రదేశ్ కి చెందిన బుజ్జు శ్యామ్, వైద్య రంగం నుంచి ఏం ఆర్ రాజగోపాల్, సేవారంగం నుంచి బెంగాల్ కి చెందిన బిస్వాస్ సేవారంగం నుంచి, కర్ణాకటకకు చెందిన ప్రముఖ వైద్యురాలు సబరతి నరసమ్మ, తదితరులు వున్నారు.
పద్మా అవార్డుల వివరాలు ....
పద్మవిభూషణ్ 3, పద్మ భూషణ్ 9, పద్మశ్రీలు 73 గా కేంద్రం ప్రకటించింది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర కు 11 దక్కగా, కర్ణాటకకు 9, తమిళనాడుకు 6, పశ్చిమ బెంగాల్ కి 5, కేరళ 4, ఒడిస్సా 4,యుపి 3,అస్సాం 3,మణిపూర్ ,బీహార్,జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ , నాగాలాండ్ రెండేసి దక్కించుకున్నాయి. త్రిపుర , జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, గోవా , మిజోరాం, ఏపీ లకు ఒక్కోటి దక్కగా తెలంగాణ నుంచి ఎవరికి చోటు దక్కక పోవడం విశేషం.
- Tags
- పద్మ అవార్డులు

