ఎన్ని కూల్చారో కాదు.. ఎన్ని బాగుచేశారో చెప్పాలి.

తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ హైదరాబాదులో ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు. అనేక వివరాలను ఆయన వెల్లడించారు. అయితే ఆయన మాటల్లో ప్రధానంగా ఇటీవలి వర్షాలకు నగర జీవితం ఎంతగా దెబ్బతిన్నదనే అంశం ప్రస్తావనకు వచ్చింది. అలాంటి ఇక్కట్లు రాకుండా ప్రభుత్వం ఎంత చక్కగా స్పందిస్తున్నదో తెలియజెప్పడానికి ఆయన ప్రయత్నించారు. ఆయన మాట్లాడిని అనేకానేక అంశాల్లో తెలంగాణలో కొ త్త జి ల్లాలు అనుకున్న దానికంటె చిన్నవిగా మారిపోయానే అంశం దగ్గరినుంచి, నయీమ్ కేసులో ఎవ్వరినైనా ఉపేక్షించేది లేదని, ఎవ్వరి విషయంలోనైనా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారని అనడం వరకు అనేక అంశాలున్నాయి. చివరికి ఈనెల 12నుంచి వారం రోజుల పాటు తాను అమెరికాలో పర్యటించబోతున్నానని, అక్కడ టీ-హబ్ లనే.. టీ-బ్రిడ్జ్ పేరుతో ప్రారంభించబోతున్నానని కూడా వెల్లడించారు.
అయితే ప్రధానంగా ఇటీవలి వర్షాల దెబ్బకు సర్కారు పనితీరుకు మచ్చ తెచ్చిన జీహెచ్ఎంసీ తీరు గురించి కొన్ని వివరాలు చెప్పారు. ఇక్కడి జీహెచ్ఎంసీ ఉద్యోగులను రాష్ట్రంలో ఏ మునిసిపాలిటీకైనా బదిలీ చేసేలా చట్టం మార్చనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఈ బదిలీలు కూడా ఉంటాయన్నారు. మొత్తం నగరపాలక సంస్థను ప్రక్షాళన చేస్తాం అని వెల్లడించారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. కూల్చివేతల ప్రస్తావన మరో ఎత్తు. నగరంలో ఇప్పటికి 800 అక్రమ కట్టడాలు కూల్చివేశాం అని లెక్కచెప్పారు పురపాలక మంత్రి కేటీఆర్. అయితే మంత్రిగారు గుర్తించాల్సిన అంశం ఒకటుంది. నిజానికి ప్రజలు ఆయన నుంచి కోరుకునేది కూల్చివేతల లెక్క కాదు. వర్షాలు ఆగిపోయిన తర్వాత నగరంలో ఎన్ని వందల కిలోమీటర్ల రోడ్లను మీరు బాగు చేశారు. మరమ్మతులు పూర్తిచేశారు. ఈ గణాంక వివరాలు కనీసం మీవద్ద ఉన్నాయా? లేదా, అలాంటి వివరాలు చెప్పుకుంటే సిగ్గుచేటు అని మిన్నకుండిపోతున్నారా అనేది జనం ప్రశ్న. ఎందుకంటే.. ఇప్పటికీ నగరంలో ప్రధాన రోడ్లన్నీ కూడా వర్షం దెబ్బకు ఘోరంగా మారిన దుస్థితిలోనే ఉన్నాయి. మరి వీటి బాగు గురించి మంత్రిగారు సీరియస్ గా పట్టించుకోవాలనేదే ప్రజల వాంఛ.

