ఉత్తమ్...నయా ప్లాన్ సక్సెస్ అవుతుందా?

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ శాయశక్తులా ప్రయత్నిస్తో్ంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. యూనివర్సిటీలు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్రను పోషించాయి. ముఖ్యంగా విద్యార్థుల ఆత్మబలిదానాల వల్లనే తెలంగాణ వచ్చిందన్నది అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లోనూ విద్యార్థి లోకం ఉద్యమ నేత కేసీఆర్ కు అండగా నిలిచింది. అయితే రాష్ట్రం ఆవిర్భావం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఉస్మానియాలోనూ నిర్భంధాలు కొనసాగుతున్నాయి. శతాబ్ది ఉత్సవాల్లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించలేని పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంపై విద్యార్థి లోకం రగిలిపోతోంది. దీన్ని కాంగ్రెస్ తనకు అవకాశంగా మలచుకునే ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో విద్యార్థుల మద్దతును కూడగట్టేందుకు ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకుంటోంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి యూనివర్సిటీలపై దృష్టిపెట్టారు.
విద్యార్థుల సెంటిమెంట్ తో....
ఉస్మానియాలో ఏ చిన్న పాటి సమావేశం పెట్టినా కాంగ్రెస్ నేతలు హాజరవుతున్నారు. ఆందోళనలు చేపట్టినా తమ మద్దతును తెలుపుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇటీవలే కొన్ని ఓయూ విద్యార్థి సంఘ నేతలను పార్టీలో కూడా కాంగ్రెస్ చేర్చుకుంది. అన్ని విధాలుగా కాంగ్రెస్ అండగా ఉంటుందని వారి భరోసా నిస్తుంది. తాజాగా ఓయూలో ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం విద్యార్థి మురళి మృతి చెందడంతో ఉస్మానియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మెరుపు ఆందోళనకు దిగారు విద్యార్థులు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ ఛార్జి చేశారు. కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్ లు ఓయూలో విద్యార్థలకు మద్దతుగా వెళ్లారు. వారికి సంఘీభావాన్ని ప్రకటించారు. ఓయూలో జరిగిన విద్యార్థి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అవలంబించిన విధానాన్నే ఇప్పుడు కాంగ్రెస్ అమలు చేస్తోంది. మొత్తం మీద అందివచ్చిన ఏ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ జారవిడుచుకునేందుకు ఇష్టపడటం లేదు. ఇప్పుడు ఓయూలో కాంగ్రెస్ పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది.

