ఈరోజు కాకినాడకు ఖచ్చితంగా వెళ్లాల్సిందేనా...!

ఏపీ సర్కార్ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కాకినాడ బీచ్ ఫెస్టివల్ కి సర్వం సిద్ధమైంది. వీనులవిందైన గానం ఒక వైపు, పసందైన తూర్పు గోదావరి జిల్లా వంటకాలు మరోవైపు అతిధులను అలరించనున్నాయి. నేటి నుంచి ఈనెల 21 వరకు సాగే బీచ్ ఫెస్టివల్ ప్రఖ్యాత సంగీత గాయకులు, సంగీత దర్శకులతో కొలువు తీరనుంది. పర్యాటక అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్ లో హెలిటూరిజం ప్రత్యేక ఆకర్షణగా ఈసారి నిలవనుంది. కాకినాడ అందాలు సముద్ర తీరం వెంబడి సాగే కార్యకలాపాలు విహంగ వీక్షణం ద్వారా వీక్షించవచ్చు.
ఫుడ్ స్టాల్స్ మరో ఆకర్షణ ...
ఆహార ప్రియులకు అలరించే రుచులు అందించడంలో తూర్పుగోదావరి జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం వుంది. దాంతో సుదూర ప్రాంతాలనుంచి వచ్చే పర్యాటకులకు గోదావరి జిల్లాల రుచులను అందించే ఏర్పాట్లను అధికార యంత్రాగం పెద్ద ఎత్తునే చేపట్టింది. అందులో భాగంగా కాకినాడ కాజా, ఏజెన్సీ బొంగు చికెన్, తాపేశ్వరం కాజాలు, ఆత్రేయపురం పూత రేకులు, అంబాజీపేట పొట్టిక్కలు, బెల్లం గారెలు, పాలకోవాలు, ఇలా అనేక రుచులకు బీచ్ ఫెస్టివల్ వేదికగా నిలుస్తుంది.
తొలిరోజు గాన గంధర్వుడితో మలిరోజు రెహ్మాన్ తో ....
బీచ్ ఫెస్టివల్ తొలిరోజు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విచ్చేస్తుండగా 20 వతేది రెండవ రోజు మణిశర్మ, ఎస్ ఎస్ తమన్, 21వతేది చివరి రోజు ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీత విభావరీలను ఏర్పాటు చేశారు. ఒక్క రెహ్మాన్ సంగీత విభావరికే దాదాపు నాలుగు కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తూ ఉండటం గమనార్హం. చివరి రోజు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు.విభజన తరువాత ఏపీ కి ఆదాయ మార్గాల్లో ఒకటైన పర్యాటకంపై ప్రభుత్వం గట్టిగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఏపీలోని కీలక ప్రాంతాల్లో ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తూ పర్యాటకులను ఆకర్షించే కార్యక్రమాలు భారీ స్థాయిలో మొదలు పెట్టింది. ఇవి ఫలించాలని ఆశిద్దాం.
- Tags
- కాకినాడ

