ఈ సీన్ మరెక్కడా కన్పించదేమో?

మోసం చేసిందంటారు ఒకరు.... మోసపోయామంటారు మరొకరు... అన్యాయం చేశారంటారు ఒకరు... న్యాయమే చేశామని చెబుతారు ఇంకొకరు. ఇలా దాదాపు ఇరవై రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, బీజేపీ ల మధ్య వార్ నడుస్తుంది. మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు పార్టీలూ ఎవరూ తగ్గడం లేదు. కేంద్రాన్ని నిలదీస్తామని టీడీప అంటుంటే... రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని బీజేపీ వాదిస్తోంది. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అప్పర్ హ్యాండ్ కోసం రెండు పార్టీలూ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. అటు బీజేపీ అధిష్టానం మాత్రం చూస్తూ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. టీడీపీ పై విమర్శలు చేయవద్దన్న ఆదేశాలూ చేయడం లేదు. అదే సమయంలో ఏపీకి చేసిన సాయం గురించి ప్రజల్లోకి వెళ్లి వివరించాలని చెప్పడం విశేషం.
మాటలకే పరిమితమా....?
అయితే ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం మాటలకే పరిమితమయిందన్న వాదనలు విన్పిస్తున్నాయి. నిజానికి ఏపీకి నాలుగేళ్లుగా కే్ంద్రం అన్యాయం చేస్తుందని చెబతున్న తెలుగుదేశం పార్టీ ఇంకా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతుండటాన్ని తప్పు పడుతున్నారు. అన్యాయం చేసిన కేంద్రంతో ఇంకా లాలూచీ ఎందుకన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే కేంద్రంలో విభజన హామీలను అమలు చేసుకునేందుకే తమ వారు పదవుల్లో ఉన్నారని, పదవులను త్యాగం చేయడం తమకు కొత్త కాదని, అవసరమైతే.. కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని చెబుతున్నారు. ఈ అవసరమైతే అన్న పదం పట్టుకుని ఇంకా పదవుల్లో ఉండటమేంటని కొందరు నిలదీస్తున్నారు.
బీజేపీ కూడా మాటల యుద్ధం చేస్తూనే....
ఏపీకి పూర్తిగా అన్యాయం చేసిన కేంద్రం, ఏపీ పట్ల వివక్ష చూపుతున్న మోడీతో ఇక రాయబారాలేంటన్నది ప్రశ్న. అయితే మోడీ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న టీడీపీకి చెందిన కేంద్రమంత్రులు ఇంకా అక్కడ కేబినెట్ లోనే కొనసాగుతున్నారు. ఇక బీజేపీ కూడా టీడీపీపై మాటల దాడిని పెంచింది. చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలకు కూడా దిగింది. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని కూడా ప్రశ్నించింది. అయితే అదే ప్రభుత్వంలో ఇద్దరు బీజేపీ మంత్రులు నేటికీ ఉన్నారు. ఇలా ఒకరికొకరు పదవులను అనుభవిస్తూనే విమర్శలు చేసుకుంటడం చూసేవారికి ఏవగింపుగా ఉందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
ఒకవైపు విమర్శలు... మరోవైపు కౌగిలింతలు....
మరోవైపు విశాఖలో జరగుతున్న భాగస్వామ్య సదస్సుకు ఉప రాష్ట్ర పతి వెంకయ్యనాయుడు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన చేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లూలూ ఆధ్వర్యంలో విశాఖలో నిర్మించబోయే కన్వెన్షన్ సెంటర్ కు శంకుస్థాపన చేయిస్తున్నారు. భాగస్వామ్య సదస్సులో కూడా కేంద్రమంత్రులు పాల్గొంటున్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు బయలుదేరే ముందు కూడా చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడారు. కేంద్రంపై ఎలా పోరాడాలన్నదీ దిశానిర్దేశం చేశారు. ఇలా ఒకరికొకరు విమర్శించుకుంటూనే కౌగిలించుకుంటుండటం ఒక్క ఏపీ రాజకీయాల్లోనే కన్పిస్తుందంటారు.

