ఈ శిక్ష చాలదు : డాక్టరుపై వేటు కంటితుడుపు కాదా?

కార్పొరేట్ ఆస్పత్రులు ధనదాహంతో ఏ రకంగా రోగుల నెత్తురు తాగుతున్నాయో.. ఒక్కొక్క రోగిని కదిలిస్తే ఒక్కొక్క కథ వెలుగులోకి వస్తుంటుంది. అలాంటి ఘోరాల్లో కెల్లా ఘోరంలాగా.. 5.7 అడుగుల ఎత్తున్న కుర్రాడు పొడవు పెరగాలని ఉన్నదంటూ సంప్రదిస్తే.. ఏకంగా మోకాళ్ల దగ్గర కోసేసి స్టీల్ రాడ్ లు పెట్టి.. రెండు నెలల్లో నువ్వు ఎత్తు పెరుగుతావ్ అని చెప్పడం మాత్రమే కాదు.. కనీసం కుటుంబసభ్యులకు సమాచారం లేకుండా ఆపరేషన్ చేసేసిన దుర్మార్గానికి ఇప్పుడు శిక్షపడింది. హైదరాబాదులోని గ్లోబల్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ చంద్రభూషణ్ పై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రెండేళ్లపాటూ నిషేదం విధించి, అతని లైసెన్సును రద్దు చేసింది.
సుమారు ఏడు నెలల కిందట నిఖిల్ రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ పొడవు పెరగాలనే కోరికతో గ్లోబల్ ఆస్పత్రిని ఆశ్రయించాడు. రోగి దొరికిందే తడవుగా అన్నట్లుగా వారు మోకాళ్ల వద్ద స్టీల్ రాడ్ లు బిగించే ఆపరేషన్ చేసేశారు. ఆ ఆపరేషన్ విఫలమైంది. ఆ సంగతి రోజుల వ్యవధిలోనే తెలిసిపోయింది. నిలదీసిన తల్లిదండ్రులతో వారికి సమాచారం ఇవ్వడం తమ నిబంధనల్లో లేదంటూ డాక్టర్ చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఏతావతా నిఖిల్ రెడ్డి ఇవాళ్టి వరకు నడవలేని పరిస్థితిలో ఇంట్లోనే ఉన్నాడు. ఆపరేషన్ పూర్తయి ఏడునెలలు గడుస్తున్నా ఇప్పటికీ నడవలేని స్థితిలోనే ఉండడం విశేషం. ఎప్పుడు డాక్టర్లను అడిగినా సరే.. మరో నెలలో లేచి నడిచే పరిస్థితి వస్తుందంటూ చెబుతున్నారని వాపోతున్నాడు.
అయితే దీనితో పాటు డాక్టర్లు అరాచకంగా వ్యవహరించిన మరికొన్ని ఉదంతాలను కూడా పరిశీలించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డాక్టరుపై నిషేధం విధించింది. అలాగే అడ్డగోలుగా విద్యార్థులకు అపెండిసైటిస్ ఆపరేషన్లు చేసిన డాక్టరుపై కూడా నిషేధం విధించింది.
నిఖిల్ రెడ్డి విషయంలో డాక్టరు చంద్రభూషణ్ వంటి కౄరులపై రెండేళ్ల నిషేధం సరిపోదని జీవితకాల నిషేదం విదించాలని, రోగి బంధువులు, పలువురు సామాజిక ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బు కక్కుర్తితో ఆపరేషన్ చేయడం ఒక ఎత్తు అయితే.. వివాదం అయిన తర్వాత.. దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడిన నిర్ల్యక్ష్యపూరిత మాటలు మరో ఎత్తు అని వారు ఆరోపిస్తున్నారు.
కేవలం డాక్టరు మీద మాత్రమే వేటు వేస్తే సరిపోతుందా అనేది.. ఇప్పుడు ప్రజల్లో నడుస్తున్న చర్చ. కార్పొరేట్ ఆస్పత్రులు ధనదాహంతోనే ఇలిం దుర్మార్గపు ఆపరేషన్లు చేసేలా తమ తమ డాక్టర్లను ప్రోత్సహిస్తున్నాయి. మరి గ్లోబల్ ఆస్పత్రి మీద కూడా నిషేదం విదించాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. వైద్యపరంగా జరిగే అరాచకాలకు మూలాలు ఎక్కడున్నాయో వాటిని చక్కదిద్దకుండా ఇలాంటి పైపై చర్యల వల్ల ఉపయోగం ఉండదని పలువురు భావిస్తున్నారు.

