ఈ వియ్యంకులిద్దరూ వేస్టేనా?

మరోసారి గంటాకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తలంటారు. ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రి గంటా శ్రీనివాసరావు పూర్తిగా వెనకబడిపోయారని, నిర్లక్ష్యంతో ఉన్నారని చంద్రబాబు కటువుగా వ్యాఖ్యానించారు. గంటా శ్రీనివాసరావు మనిషి కన్పించరని, సమావేశాలకు రారని, ఫైళ్లన్నీ పెండింగ్ లో పెట్టుకుంటారని గంటాపై చంద్రబాబు తీవ్రవ్యాఖ్యలు చేయడం మంత్రివర్గంలో కలకలం రేపింది. మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఒక ఫైలును పరిష్కరించేందుకు 66 రోజుల మూడు గంటల సమయం తీసుకుంటున్నట్లు చంద్రబాబు సమీక్షలో వెల్లడి కావడంతో ఆయనపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఆ తర్వాత స్థానం మంత్రి అఖిలప్రియదే. అఖిలప్రియ ఒక ఫైలును క్లియర్ చేయడానికి 35 రోజుల సమయం తీసుకుంటున్నట్లు తేలింది. దీంతో అఖిలప్రియ మీద కూడా చంద్రబాబు ఫైర్ అయ్యారు.
నారాయణ కూడా....
ఇక మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ కూడా ఫైళ్ల పరిష్కారంలో పూర్తిగా వెనుకబడిపోయారు. మంత్రి నారాయణ ఒక ఫైలును క్లియర్ చేయాలంటే 21 రోజుల సమయం తీసుకుంటున్నారు. ఇక ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అయితే ఒక ఫైలును 6 రోజుల సమయంలో క్లియర్ చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖమంత్రి జవహర్ అయితే ఒక ఫైలును పరిష్కరించడానికి దాదాపు ఇరవై రోజులకు పైగా సమయం తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి సమీక్షలో వెల్లడయింది. అయితే త్వరితగతిన ఫైళ్లను క్లియర్ చేస్తున్న వారిలో హోంమంత్రి చినరాజప్ప ఉన్నారు. చినరాజప్ప ఒక ఫైలు పరిష్కారానికి కేవలం నాలుగు గంటల సమయమే తీసుకుంటున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా ఆరుగంటల్లో ఫైళ్లను క్లియర్ చేస్తుండటంతో ముఖ్యమంత్రి మెచ్చుకున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ లేట్ చేయడంతో్ అవినీతికి ఆస్కారం ఇచ్చినట్లవుతుందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు.

