ఈ ఓట్లపైనే జగన్ చూపు...!

జగన్ పాదయాత్రలో అనేక హామీలు ఇస్తున్నారు. అయితే ఎక్కువగా యువ ఓటర్లను దృష్టిలో పెట్టుకునే చేస్తున్న హామీలు ఆయనకు ఎంతవరకూ ఉపయోగపడతాయన్నది ఇప్పుడే చెప్పలేకున్నా చాలావరకూ ప్రయోజనమే చేకూరుతుందన్నది విశ్లేషకుల అంచనా. 2019 నాటికి కొత్త ఓటర్లు భారీగా వస్తున్నారు. యువ ఓటర్లే వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్లీనరీ దగ్గర నుంచి పాదయాత్రలో కూడా వారిపైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నట్లుకన్పిస్తోంది.
పరిశ్రమలు రాకపోవడంతో....
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా అనుకున్న పరిశ్రమలు ఇంకా రాలేదు. పైగా నిరుద్యోగ భృతి నెలకు వెయ్యి రూపాయలు ఇస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతవరకూ అమలు చేయలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో యువతను ఆకట్టుకోవాలన్న థ్యేయంగానే జగన్ పాదయాత్ర సాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న జగన్ అక్కడి పరిశ్రమలు మూతబడటంపై ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. అలాగే విభజన చట్టంలో ఉంచిన అనేక సంస్థలు ఇంకా ఏపీకి దక్కలేదు. దీనిపైన కూడా జగన్ ప్రసంగాల్లోచోటు కల్పిస్తున్నారు.
యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు....
అలాగే ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందని చెబుతున్నారు. ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వకపోయినా.. టీడీపీ ప్యాకేజీకి తలూపిందని, దీనివల్ల యువత ఎక్కువగా నష్టపోయారన్న విషయాన్ని జగన్ పదే పదే చెబుతున్నారు. గతంలో వైసీపీ నిర్వహించిన యువభేరి కార్యక్రమాలకు సయితం యువత ఎక్కువగా హాజరవ్వడం ఇందుకు నిదర్శనంగా వైసీపీ నేతలు చెబుతున్నారు. అందుకోసమే జగన్ నిరుద్యోగ భృతిని రెండు వేల రూపాయలు తాను అధికారంలోకి వస్తే ఇస్తామంటున్నారు. ప్రత్యేక హోదా కోసం చివరి వరకూ పోరాడతామని చెబుతున్నారు. అలాగే 45 సంవత్సరాల వయస్సున్న అర్హులైన వారికి పెన్షన్ ఇవ్వడం కూడా ఇందులో భాగమేనంటున్నారు. జగన్ ను పాదయాత్రలో కలుస్తున్న వారు కూడా ఎక్కువగా యువకులే కావడం విశేషం. ఈసారి యువ ఓటర్లను ఆకట్టుకుని పార్టీని గెలిచేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.
- Tags
- జగన్

