ఈ ఇద్దరి బంధానికి ఇక చివరి రోజులే...!

దీర్ఘకాలంగా ఉన్న మిత్రపక్షం బీజేపీకి బై బై చెప్పనుందని దాదాపుగా తేలిపోయింది. బీజేపీ, శివసేన పార్టీలు కొన్నేళ్లుగా మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నాయి. అయితే గత ఏడాది కాలం నుంచి శివసేన, బీజేపీల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. కొంతకాలం జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనంతరం ఈ విభేదాలు మరింత తీవ్రమయ్యాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా మహారాష్ట్రలోని స్థానికసంస్థల ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేసేందుకు శివసేన ఇష్టపడటం లేదు. అంతేకాకుండా బీజేపీపై శివసేన విరుచుకుపడుతుండటం ఇటీవల ఎక్కువయ్యింది. బీజేపీయే కాకుండా ప్రధాని మోడీని టార్గెట్ గా చేసుకుని శివసేన తీవ్ర విమర్శలు చేస్తోంది. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కేంద్ర నిర్ణయాలను తీవ్రంగా తప్పుపడుతుంది. తన అధికారిక పత్రిక సామ్నాలో సయితం మోడీ సర్కార్ ను శివసేన చీల్చి చెండాడేస్తుంది.
ఏడాది మాత్రమే ఉంటామంటున్న....
ఈ నేపథ్యంలో శివసేన బీజేపీ మిత్ర బంధం తెగిపోతుందన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఇది నిజమేనంటున్నారు శివసేన పార్టీ నేతలు. ఇటీవలే శివసనే యువజన విభాగం అధ్యక్షుడు, ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే కూడా బీజేపీని తీవ్రస్వరంతో హెచ్చరించారు. తాజాగా శివసేన నేత సంజయ్ రౌత్ ఈ విషయంపై స్పష్టత నిచ్చే ప్రయత్నం చేశారు. శివసేన, బీజేపీ బంధం ఇక ఎంతకాలమో కొనసాగదని సంజయ్ రౌత్ చెప్పారు. మహారాష్ట్ర సర్కార్ లో భాగస్వామిగా ఉన్న శివసేన మరో ఏడాదిలో తెగదెంపులు చేసుకుంటున్నట్లు కూడా ఆయన చెప్పడం విశేషం. మహారాష్ట్రలో సొంతంగా ఎదిగేందుకు శివసేన ప్రయత్నిస్తుందని సంజయ్ రౌత్ చెప్పారు. మొత్తం మీద శివసేన, బీజేపీ బంధానికి చివరి రోజులు వచ్చేశాయనే చెప్పొచ్చు.

