ఇవాంకా...రా...రావమ్మా...!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె దెబ్బకు హైదరాబాద్ నగరం రూపు రేఖలే మారుతున్నాయి. ట్రంప్ కుమార్తె ఇవాంక ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ రానున్నారు. ఆమె గ్లోబల్ ఎంట్రప్రియన్యుర్ షిప్ సదస్సులో పాల్గొంటారు. మూడు రోజుల పాటు ఈ సదస్సు హైదరాబాద్ లో జరగనుంది. వేలాది మంది అతిధులు రానున్నారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా ఒకరోజు సదస్సులో పాల్గొననున్నారు. ఇవాంక రాకతో నగరం మొత్తాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఇవాంకాకు ఫలక్ నుమా ప్యాలెస్ లో బస ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆమె నేరుగా ఫలక్ నుమా ప్యాలెస్ కు వెళతారు. దీంతో ఆ మార్గం మొత్తాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. మరో వైపు పోలీసు బృందాలు ఇవాంకా పర్యటించే, బస చేసే ప్రదేశాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎఫ్ బి అధికారులు కూడా వచ్చి ఇవాంకా భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
వందకోట్ల ఖర్చు....
ఇవాంకా పర్యటనతో నగరాన్ని ముస్తాబు చేసేందుకు జీహెచ్ఎంసీ మొత్తం 100 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. జీహెచ్ఎంసీ అధికారులు మూడు షిఫ్ట్ లలో రేయింబవళ్లూ పనిచేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు మొత్తం ఇవాంకా పర్యటన ఏర్పాట్లను చూసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ లోని కిందిస్థాయినుంచి ఉన్నతాధికారి వరకూ ఇవాంకా పేరునే జపిస్తున్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, పర్యాటక శాఖ, హెచ్ఎండీ అధికారులు, సిబ్బంది అందరూ నగరంలో చక్కర్లు కొడుతూ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇవాంకా పర్యటించే ప్రాంతాల్లో అద్దాల్లా మెరిసే రోడ్లను నిర్మిస్తున్నారు. ఆ ప్రాంతంలో గోడలపైన అందమైన బొమ్మలను వేయిస్తున్నారు. హైటెక్స్ లోని హెచ్ఐసీసీలో జరిగే సదస్సుకు ఇవాంకా హాజరుకానున్నారు.
ఎప్పుడో చేయాలనుకున్న పనులు....
రోడ్ల నిర్మాణం, కొన్నింటికి మరమ్మత్తులు, ఫుట్ పాత్ ల ఏర్పాటు, జంక్షన్ల అభివృద్ధి, గార్డెనింగ్, లేస్ మార్కింగ్, పెయింటింగ్ వంటి పనులను శరవేగంతో పూర్తి చేస్తున్నారు. ఇవాంకా చార్మినార్, లాడ్ బజార్ ప్రాంతాలను సందర్శించే అవకాశముండటంతో అక్కడ కూడా అభివృద్ధి పనులను వేగం చేశారు. చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతంలో పెడెస్టేరియన్ పనులను 2006లో చేయాలనుకున్నారు. కాని చేయలేదు. ఇప్పుడు ఇవాంక దెబ్బకు చేసేస్తున్నారు. ఇవాంకా చార్మినార్ వద్ద నడిచేందుకు ప్రత్యేక దారిని తయారు చేస్తున్నారు. చార్మినార్ చుట్టుపక్కల ఉన్న పురాతన కట్టడాలను ముస్తాబు చేస్తున్నారు. ఇక బిక్షగాళ్లను కూడా ఏరిపారేస్తున్నారు. వారు కన్పించకుండా వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వసతి గృహంలో ఉంచుతున్నారు. బిక్షగాడు కన్పిస్తే చాలు వెంటనే జీహెచ్ఎంసీ వాహనం ప్రత్యక్షమై వారిని ఎక్కించుకుని వెళుతుంది. చర్లపల్లి, చంచలగూడ జైలులో ఉన్న ఆనందాశ్రమానికి ఇప్పటికే బిక్షగాళ్లను వందల సంఖ్యలో తరలించారు. అలాగే అమెరికా నుంచి ప్రత్యేక భద్రతా బలగాలు రెండు రోజుల్లో రానున్నాయి. ఇవాంకా నివసించే ఫలక్ నుమా ప్యాలెస్ చుట్లుపక్కల ఉన్న నివాసాల్లో వారు మాత్రమే ఉండాలని, బంధువులు, ఇతరులు ఉండేందుకు వీలు లేదని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
- Tags
- ఇవాంకా

