ఇలాచేస్తే సరిపోతుందా?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇకపై పాలన పారదర్శకంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటవల ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్ పై జరిగిన దాడితో పార్టీ, ప్రభుత్వం పరువు గంగలో కలిసి పోయింది. కొందరు ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తనతో పార్టీతో పాటు ప్రభుత్వం కూడా ఇబ్బందుల పాలు కావాల్సి వచ్చింది. చివరకు లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు మేధావి వర్గాల్లో కూడా ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
ప్రత్యక్ష ప్రసారాల ద్వారా......
చీఫ్ సెక్రటరీపై దాడి సంఘటన అరవింద్ కేజ్రీవాల్ కు చికాకులను తెప్పించిందనే చెప్పాలి. అయితే ఇకపై ఇలాంటి సంఘటలను జరగకుండా ఉండేందుకు ఆయన ప్రభుత్వ సమీక్షలను ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రత్యక్ష ప్రసారాలు ఉంటే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవని, అలాగే ఉన్నతాధికారులు కూడా జాగ్రత్తగా మాట్లాడతారని కేజ్రీవాల్ భావిస్తున్నారు. ప్రభుత్వంపై చెడు అభిప్రాయం కలగకుండా ఉండేందుకు ప్రత్యక్ష ప్రసారాలను చేస్తే పారదర్శకంగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు.
ఫైళ్లన్నీ ఆన్ లైన్లో....
అంతేకాకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా సక్రమంగా అమలు జరగడం లేదు. ఉన్నతాధికారులు కొందరు ఫైళ్లను పెండింగ్ లో పెడుతున్నారు. కొన్ని నిర్ణయాలు లెఫ్ట్ నెంట్ గవర్నర్ వద్దనే అమలు కాకుండా ఉంటున్నాయి. ఆయన నిర్ణయం తీసుకుంటేనే అమలు కాని పరిస్థితి. ఇవన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడు అర్థమయ్యేలా, ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇకపై ప్రభుత్వానికి చెందిన అన్ని ముఖ్యమైన ఫైళ్లను ఆన్ లైన్లో ఉంచాలని నిర్ణయించారు. దీనివల్ల ఎవరి దగ్గర ఫైలు ఆగిపోయిందీ ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది. ఇలాగైనా ప్రభుత్వంపై తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఉంటాయని కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
సీసీ టీవీ ఫుటేజ్ ట్యాంపరింగ్?
అయితే ఢిల్లీ చీఫ్ సెక్రటరీ దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు అరెస్టయ్యారు. వారికి బెయిల్ కూడా మంజూరు కాలేదు. మరోవైపు పోలీసులు సీఎం నివాసంలో సీసీ ఫుటేజీని పరిశీలించారు. అయితే ఈ ఫుటేజీని ట్యాంపరింగ్ చేశారని పోలీసులు న్యాయస్థానానికి నివేదించడం సంచలనం కల్గిస్తోంది. ఈ ఫుటేజీ మొత్తాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి పరీక్షలు చేయిస్తామని పోలీసులు చెప్పారు. ఈ సమావేశం సీఎం డ్రాయింగ్ రూములో జరిగిందని, సీసీటీవీ ఫుటేజీ టైమింగ్స్ వేరేగా ఉన్నాయనితేలిందని పోలీసులు వెల్లడించారు. మొత్తం మీద ఈ తలనొప్పుల నుంచి బయటపడేందుకు కేజ్రీవాల్ పాలనలో పారదర్శకతతో పాటు, సమావేశాలన్నింటినీ ఢిల్లీ ప్రభుత్వ వెబ్ సైట్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించడం విశేషం.
- Tags
- కేజ్రీవాల్

