ఇన్ని సమస్యలా? పరిష్కరించేదెలా?

వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర గుంటూరు జిల్లాలో జరగుతోంది. ఆయన చిలకలూరి పేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో ఇప్పటి వరకూ జగన్ కు ఇరవై ఐదు వేలకు పైగా వినతులు వచ్చినట్లు ఆ పార్టీ చెబుతోంది. జగన్ ఇప్పటి వరకూ ఆరు జిల్లాల్లో పర్యటించారు. ఏడో జిల్లా అయిన గుంటూరులో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. జగన్ కు వినతి పత్రాలు వెల్లువలా వస్తున్నాయి. ఎక్కువగా వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు జగన్ వద్దకు చేరిన ఇరవై అయిదు వేల వినతిపత్రాలు సామూహిక సమస్యలే కావడం విశేషం.
లక్ష దాటిన వ్యక్తి గత వినతులు....
సామూహిక సమస్యలతో పాటుగా ఇక వేల సంఖ్యలో వినతి పత్రాలు అధికంగా వస్తున్నాయి. వాటి సంఖ్య లక్ష దాటుతుందంటున్నారు. ముఖ్యంగా పింఛన్లు, పక్కా ఇళ్లు, ఫీజు రీఎంబర్స్ మెంట్, వైద్య పరమైన సాయం వంటివి ఎక్కువగా జగన్ చెంతకు చేరుతున్నాయి. ఎక్కువగా జన్మభూమి కమిటీ సభ్యుల సిఫార్సు ఉంటేనే పింఛన్లు కాని, పక్కా ఇళ్లు కాని మంజూరు చేస్తున్నారని ప్రజలు జగన్ దృష్టికి తీసుకువస్తున్నారు. అలాగే తమ సమస్యను పరిష్కరించుకోవాలంటే అధికారి వద్దకు వెళ్లేకంటే జన్మభూమి సభ్యుల వద్దకే వెళ్లమంటున్నారని ఫిర్యాదు చేశారు.
భరోసా ఇస్తున్న జగన్....
దీంతో జగన్ వారికి భరోసా ఇస్తున్నారు. జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం దోపిడీకి తెరతీసిందని, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని జగన్ ఆరోపించారు. జన్మభూమి కమిటీలే గ్రామాలను శాసిస్తున్నాయన్నారు. ఈ పద్ధతి విడనాడకుంటే ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ అని చెబుతున్న చంద్రబాబుకు ప్రజల సమస్యలను పట్టడం లేదా? అని ప్రశ్నించారు. దోపిడీ చేస్తున్న జన్మభూమి కమిటీలను అదుపులో పెట్టాలని జగన్ కోరారు.
అందరూ ఒక్కటై.....
గుంటూరు నియోజకవర్గంలో జగన్ పర్యటనలో నాయకులంతా ఒక్కటై పాల్గొంటున్నారు. నరసరావుపేట,గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తాఫా, మాజీ ఎంపీ బాలశౌరి తదితరులు జగన్ పాదయాత్ర వెంట నడుస్తున్నారు. గుంటూరు జిల్లాలో జగన్ పాదయాత్రకు మంచి స్పందన కన్పిస్తుండటంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో ఫ్యాన్ రెపరెప లాడుతుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
