ఇద్దరు చంద్రుల తనయులు ఒకే చోట...!

రెండు రాష్ట్రాలుగా ఏపీ విడిపోయిన తర్వాత.. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడ కలుసుకున్నా మీడియా అటెన్షన్ అంతా వారి మీదే ఫోకస్ అయింది.. అవుతోంది! ఇద్దరూ ఎప్పుడు కలుస్తారు? ఏం మాట్లాడుకుంటారు అనే అంశాలు ఎప్పటికీ ఆసక్తి కలిగిస్తాయి! అయితే రెండు ప్రభుత్వాలు ఏర్పడిన నాలుగేళ్లలో దాదాపు.. చాలా సార్లు వీరు కలుసుకున్నా.. వీరి తనయులు మాత్రం ఎప్పుడూ ఒకే వేదిక మీదకు రాలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్న, తమ్ముడు అనుకుంటూ విమర్శలు చేసుకున్నా.. ఒక్కసారి ఎదుటపడింది లేదు. అయితే త్వరలోనే వీరిద్దరూ ఒకే వేదిక మీదకు రాబోతున్నారు. హైదరాబాద్లో జరిగే ఒక అవార్డుల కార్యక్రమంలో వీరు పాల్గొనబోతున్నారు.
ఆసక్తిగా....
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, ఐటీ-పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లోకేష్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకునేందుకు శ్రమిస్తున్నారు. ఇక ఇప్పటికే తండ్రి తగ్గ తనయుడిగా పేరు కొట్టేశారు తెలంగాణ సీఎం కేసీఆర్ కొడుకు, ఐటీ-పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్! హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి మరింత కృషిచేస్తూ.. హైదరాబాద్కు బ్రాండ్ గా మారిపోతున్నారు. మరి ఈ ఇద్దరూ పార్టీలో నెంబర్.2 స్థానాన్ని సంపాదించేసుకున్నారు. అయితే వీరిద్దరూ ఒక్కసారి కూడా వేదిక పంచుకోలేదు. ఇందుకోసం ఇరు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
యువమంత్రులూ ఒకే వేదికపై....
హైదరాబాద్ లో ఈ నెల 23న ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయుడు, మంత్రి కెటీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడు, మంత్రి నారా లోకేష్ ఒకే వేదికపైకి చేరనున్నారు. ఒక ప్రయివేటు ఛానల్ ఈ నెల23న హైదరాబాద్ లోని హెచ్ఐఐసీలో బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలోనే ఇద్దరు యువ మంత్రులు పాల్గొననున్నారు. వీరిద్దరూ కలసి ఒకే వేదికపై ఓ కార్యక్రమంలో పాల్గొననుండటం ఇదే మొదటిసారి. ఈ మధ్య మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో ఐటి రంగం ప్రగతిలో ఏపీ సీఎం చంద్రబాబు పాత్రను కాదనలేమని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ ప్రశంసలు ఎందుకంటే....
ఒకప్పుడు చంద్రబాబు తీరును విమర్శించిన కేటీఆర్ అకస్మాత్తుగా చంద్రబాబుపై ప్రశంసలు కురిపించటం వెనక రాజకీయ కోణం ఉందనే విశ్లేషణలు వచ్చాయి. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహా సభలకు అధికారికంగా చంద్రబాబుకు ఆహ్వానం అందలేదు. కానీ తనను పిలవకపోయినా పర్వాలేదు అని.. ప్రపంచ తెలుగు మహాసభలకు తమ మద్దతు ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలనే తమ అభిమతం అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఇద్దరు యువనేతలు కెటీఆర్, లోకేష్ పాల్గొననుండటంతో అందరి చూపు వీరిపైనే పడబోతోంది.

