ఇద్దరూ...ఇద్దరే... అయిన వారికే నిధులు

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఒకే తీరున నడుస్తున్నాయి . తమకు నచ్చిన వారు ఉంటే ఒక రకంగా నచ్చని వారు ఉంటే మరో రకంగా నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు సాగిపోతుంది. ముఖ్యంగా ఉప ఎన్నికలు వస్తాయి అనుకునే చోట నిధుల ప్రవాహం మామూలు గా ఉండటం లేదు. అలాగే మంత్రుల నియోజకవర్గాల్లో ఒక రేంజ్ లో నిధుల కేటాయింపు సాగిపోతుంది. ఇక విపక్షాలు గెలిచిన చోట్ల ఏపీలో అయితే రాజ్యాంగ ఉల్లంఘనలకు సైతం పాల్పడుతూ జీవోలు సైతం జారీచేస్తూ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ లకు రెండేసి కోట్ల రూపాయల నిధులు కేటాయించి పారేసింది సర్కార్.
నిజామాబాద్ కు 350 కోట్ల రూపాయల నిధులు ...
తెలంగాణ లోని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 350 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ మంత్రి కేటీఆర్ నిర్ణయం తీసుకోవడం దీనిపై ఆయన సోదరి ఎంపీ కవిత హర్షం వెలిబుచ్చడం జరిగిపోయాయి. ఏపీలో ఒక్క నంద్యాల ఉపఎన్నికలకు ముందు టిడిపి ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు కేటాయించింది. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఇష్టారాజ్యానికి లెక్కేలేదు. ఇద్దరు చంద్రులు సమగ్ర అభివృద్ధికి కట్టుబడ్డామని మాటల్లో ప్రకటించడమే కానీ చేతల్లో అయిన వారికి కంచాల్లో కానీ వారికి ఆకుల్లో వడ్డిస్తున్నారు. ఇదేమి దారుణమని వీరిని ప్రశ్నలు వేసేవారే లేకుండా పోయారు.
ఎమ్యెల్యేలు తిరుగుతున్నా దిక్కు లేదు ....
విభజన తరువాత లోటు బడ్జెట్ లో వున్న ఏపీకి వున్న అన్ని కష్టాలు ఎవరికి లేవు. రోడ్లు , డ్రైన్లు, ఇళ్ళ స్థలాలు వంటి మౌళిక వసతులకు కనీస నిధులు కోరుతూ 13 జిల్లాలలోని ఎమ్యెల్యేలు కాళ్ళు అరిగేలా అమరావతి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. కనీసం ముఖ్యమంత్రి వారి గోడు వినేందుకు సైతం సమయమే ఇవ్వడం లేదు. దాంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో కూడా వారికి అర్ధం కావడం లేదు. ఇలాంటి పరిస్థితిలో ప్రజలముందుకు వెళ్లేందుకు చాలా ఇబ్బందికర పరిస్థితిని శాసన సభ్యులు ఎదుర్కొంటున్నారు. తమ ప్రభువులు ఎప్పుడు కరుణిస్తారా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

