ఇద్దరూ ఆ సంఘటన తర్వాత కలిశారే...!

నిన్నటి వరకూ ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. విమర్శించుకున్నారు. కాని ఈరోజు ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. అభివాదం తెలుపుకున్నారు. వారిద్దరే ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ నేతలిద్దరి మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోడీ పాక్ అధికారులతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మణి శంకర్ అయ్యర్ ల సమావేశం అయ్యారని, ఆ సమావేశం వెనక కథేంటో చెప్పాలని నిలదీశారు. గుజరాత్ ఎన్నికలను పాకిస్థాన్ ప్రభావితం చేస్తుందని కూడా ప్రధాని తీవ్రంగా విమర్శించారు. ఈ విమర్శలను మాజీ ప్రధాని మన్మోహన్ తిప్పికొట్టారు. గుజరాత్ లో ప్రచారం హద్దులు దాటిందన్నారు. తనపై లేనిపోని అభాండాలను చేస్తూ ప్రధాని మోడీ ఓట్లు దండుకోవాలనిచూస్తున్నారని ఆరోపించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు మోడీ క్షమాపణలు చెప్పాలని కూడా మన్మోహన్ డిమాండ్ చేశారు.
అమరులకు నివాళి సందర్భంగా....
అయితే గుజరాత్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈరోజు పార్లమెంటు పై దాడి జరిగి 16 ఏళ్లయింది. 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంటుపై ముష్కరులు దాడి చేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అమరులకు నివాళులర్పించేందుకు ప్రధాని మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ అక్కడకు వచ్చారు. ఇద్దరూ అభివాదం చేసుకున్నారు. కరచాలనం కూడా చేసుకున్నారు. పార్లమెంటు లోపల నిర్వహించిన కార్యక్రమంలో ఇద్దరూ పాల్గొన్నారు. నిన్నటి వరకూ ఒకరినొకరు విమర్శించుకున్న నేతలు ఎదురుపడగానే అభివాదం చేసుకోవడాన్ని అక్కడి నేతలు ఆసక్తిగా తిలకించారు.

