ఇద్దరు మంత్రులకు చంద్రబాబు అక్షింతలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు మంత్రులపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనసేన అధ్యక్షుడుపవన్ కల్యాణ్ పై అసందర్భంగా వ్యాఖ్యలుచేసినందుకు మంత్రి పితాని సత్యానారాయణపై ఆయన సీరియస్ అయ్యారు. అసహనం చెందారు. ఎందుకు మాట తూలారని ఈ సందర్బంగా పితానిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలిసింది. పవన్ కల్యాణ్ తో సత్సంబంధాలను కొనసాగించాలని తాను భావిస్తుంటే మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు. అలాగే మంత్రి దేవినేని ఉమ పైన కూడా ఆయన సీరియస్ అయినట్లు తెలిసింది. విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించకపోవడంపై ఉమను చంద్రబాబు దాదాపు నిలదీసినట్లు తెలిసింది. మంగళగిరిలో రాష్ట్ర కార్యాలయం ప్రారంభించడానికి ఇంకా సమయం ఉన్నందున... తాత్కాలికంగా విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయకపోవడంపై దేవినేని ఉమను ప్రశ్నించారు. తాను విదేశీ టూర్ నుంచి వచ్చిన తర్వాత రాష్ట్ర పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తానని చెప్పారు. వైసీపీ కార్యాలయం నిన్న విజయవాడలో ప్రారంభం కావడాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ఈరోజు అమరావతిలో జరిగింది. ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి మంత్రులిద్దరికీ అక్షింతలు వేసినట్లు సమాచారం.
పయ్యావులపైనా ఆగ్రహం......
ఇక అనంతపురంలో పరిటాల శ్రీరామ్ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి హాజరయిప్పుడు తెలుగుదేశంపార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించడం ఎందుకని చంద్రబాబు కోపగించుకున్నారు. ముఖ్యంగా పయ్యావుల కేశవ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రహస్య మంతనాలంటూ మీడియాకు ఎందుకు అవకాశం కల్పించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తానే అనంతపురంలో పెళ్లికి వెళ్లి అరగంట సేపు మాత్రమే ఉండివచ్చానని, అక్కడ ఎక్కువ సేపు ఎందుకు ఉండాల్సి వచ్చిందని కొందరు నేతలను నిలదీసినట్లు తెలిసింది. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉందన్న విషయాన్ని మర్చిపోయి కొందరు కేసీఆర్ తో సన్నిహితంగా మెలగడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. అలాగే అనంతపురంలో ఈరోజు వైసీపీ ఆధ్యర్యంలో జరిగిన యువభేరి విషయాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా యువభేరిలు ఎందుకని చంద్రబాబు ఎద్దేవాచేశారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం హాట్ హాట్ గా సాగింది.
- Tags
- చంద్రబాబు

