ఇదే జరిగితే అమరావతికి నీటి కష్టాలు తప్పవా...?

గోదావరి నది నీటి వాడకంపై తెలంగాణ, ఏపీ నడుమ వార్ మొదలైంది. ఇది ఇప్పట్లో తీరేలా కూడా కానరావడం లేదు. తెలంగాణ వివిధ ప్రాజెక్టులను, ఏపీ పోలవరం, పురుషోత్తపట్నం వంటి ప్రాజెక్టులను తలపెట్టడం తో నీటి వాటాలు పీఠముడిలా పడనున్నాయి. దాంతో తాజాగా సమావేశం అయిన గోదావరి నీటి యాజమాన్య బోర్డు ఇరు రాష్ట్రాలు ఒకరిపై మరొకరు చేసుకున్న ఫిర్యాదులతో సమావేశం అర్ధాంతరంగా వాయిదా వేసింది.
45 టీఎంసీలు డిమాండ్ చేస్తున్న తెలంగాణా ...
కృష్ణా జలాల మళ్ళిస్తున్నందున తమకు జరిగిన అన్యాయానికి 45 టిఎంసిల నీటివాటా ఇవ్వాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తుంది. దీనిపై ఏపీ సర్కార్ వివరణ ఇస్తూ పట్టిసీమ పురుషోత్తమపట్నం, చింతలపూడి పోలవరం ప్రాజెక్ట్ లో భాగమేనని వాదించింది. కాళేశ్వరం , శ్రీరాంసాగర్ 2 మాటేమిటని తెలంగాణ ను ప్రశ్న వేసింది. అవి రీడిజైనింగ్ ప్రాజెక్ట్ లు అయినందున డిపిఆర్ లు బోర్డు ముందు పెట్టాలిసిన అవసరం లేదంటూ తెలంగాణ సర్కార్ వాదించింది. విభజన జరిగితే ఇరు రాష్ట్రాల నడుమ నీటి తగాదాలు తప్పవన్న నిపుణుల వాదన కృష్ణ, గోదావరి యాజమాన్య బోర్డు ల ముందు నడుస్తున్న పంచాయతీలు రుజువు చేస్తున్నాయి. ఇరు రాష్ట్రాలు సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి నిలిపిన నేపథ్యంలో భవిష్యత్తులో ఏపీ తెలంగాణ నడుమ నీటి యుద్ధాలు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. తెలంగాణ సర్కార్ గోదావరి నీటిని సాధ్యమైనంత వినియోగించుకునే ఆలోచనలో శరవేగంగా ప్రాజెక్టులు చేపట్టడంతో ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి కానీ పక్షంలో గోదావరి, కృష్ణా డెల్టా లతో బాటు అమరావతికి నీటి కష్టాలు దారుణంగా వుండే పరిస్థితి కనిపిస్తుంది.

