ఇక్కడ శివసేన బీజేపీకి షాకిస్తుందా?

గుజరాత్ ఎన్నికల్లో శివసేన బీజేపీకి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమయింది. బీజేపీ, శివసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా తలెత్తిన విభేదాలతో శివసేన బీజేపీకి షాక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. గుజరాత్ ఎన్నికలకు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పోటీ చేసేందుకు శివసేన సమాయత్తమవుతుంది. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేయాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయించారు. గత ఎన్నికల్లో కలిసే పోటీ చేసిన శివసేన ఈసారి విడిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం విశేషం. 2012 లో జరిగిన గుజరాత్ ఎన్నికల్లో శివసేన పోటీ చేయలేదు. బీజేపీకి మద్దతిచ్చింది. అయితే ఈసారి మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని శివసేన నిర్ణయించింది.
పట్టున్న ప్రాంతంలోనే పోటీ....
శివసేనకు, బీజేపీకి మధ్య ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణ సమయం నుంచి విభేదాలు తీవ్రమయ్యాయి. అంతకు ముందు పెద్ద నోట్ల రద్దు విషయంలోనూ ప్రభుత్వ నిర్ణయాన్ని శివసేన తప్పు పట్టింది. తమ అధికార పత్రిక సామ్నాలో ఎండగట్టింది. అలాగే జీఎస్టీ పైన కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు మాత్రమే కాకుండా రాహుల్ గాంధీని ప్రశంసలతో ముంచెత్తడం విశేషం. మహారాష్ట్ర మంత్రివర్గంలో శివసేన సభ్యులున్నారు. కేంద్రమంత్రివర్గంలోనూ ఉన్నారు. అయినా ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలతో శివసేన ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ హిందూ ఓటు బ్యాంకు కు గండి పడుతుందేమోనన్న ఆందోళన కమలనాధుల్లో నెలకొని ఉంది. అయితే తమకు పట్టున్న ప్రాంతాల్లోనే తాము పోటీకి అభ్యర్థులను దింపుతామని, తమ పార్టీ టిక్కెట్ కోసం నేతలు క్యూ కడుతున్నారని శివసేన నేతలు చెబుతున్నారు.
- Tags
- శివసేన బీజేపీ

