ఇక్కడ జగన్ మళ్లీ ‘‘ప్రకాశిం’’చేనా?

వైసీపీ అధినతే జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనుంది. 89వ రోజున ఆయన ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ ఆరుస్థానాల్లో విజయం సాధించింది. ఇందులో నలుగురు శాసనభ్యులు సైకిలెక్కేశారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టి పాటి రవికుమార్ లుపార్టీని వీడారు. వీరి స్థానంలో కొత్తవారిని ఇన్ ఛార్జులుగా నియమించినా ఇంకా పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేయలేదు. పార్టీలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డికి మధ్య ఆధిపత్య పోరుతో జిల్లా వ్యాప్తంగా నేతలు ఇబ్బంది పడుతున్నారు.
అసంతృప్తులను బుజ్జగిస్తూ....
ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్ర ప్రకాశంలో ప్రారంభం కాబోతోంది. దర్శి నియోజకవర్గంలో మొన్నటి వరకూ ఇన్ ఛార్జిగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ని తప్పించి బాదం మాధవరెడ్డిని నియమించారు. అయితే నెల్లూరు జిల్లాలో పాదయాత్రలో ఉన్నప్పుడే జగన్ బూచేపల్లి శివప్రసాద్ ను పిలిపించుకుని మాట్లాడారు. రాజకీయాలంటే ఇష్టం లేకుంటే మాధవరెడ్డికి సహకరించాలని, లేకుంటే పోటీ చేయాలని కోరారు. అయితే శివప్రసాద్ మాత్రం తన నిర్ణయాన్ని త్వరలోనే చెబుతారని చెప్పారు. ఇలా పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించకముందే జగన్ నేతల మధ్య ఉన్న విభేదాలను, అసంతృప్తులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
పాదయాత్ర ఇలా.....
ప్రకాశం జిల్లాలో మొత్తం 250 కిలోమీటర్ల మేరకు జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. కందుకూరు, కొండపి, కనిగిరి, మార్కాపురం, సంతనూతలపాడు, దర్శి, అద్దంకి, పర్చూరు, చీరాల మీదుగా జగన్ పాదయాత్ర కొనసాగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం 12 నియోజకవర్గాలున్న ప్రకాశం జిల్లాలో 9 నియోజకవర్గాల గుండా పాదయాత్ర వెళ్లనుంది. కందుకూరు నియోజకవర్గంలో తొలుత కొత్తపేట నుంచి ప్రారంభమయ్యే యాత్ర రాళ్లపాడు రిజర్వాయర్, జంపాలవారి పాలెం, లింగ సముద్రం, బలిజపాలెం, రామకృష్ణాపురం, వీరారెడ్డిపాలెం, వలేటి వారిపాలెం, అమ్మపాలెం, పోలినేని పాలెం, కూనిపాలెం, అడ్డరోడ్డు, పోకూరు, నూకవరం, బడేవారి పాలెం, కాకుటూరు,చెర్లోపల్లి, కందుకూరు, దూబగుంట నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగనుంది. ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల ఫలితాలనే రిపీట్ చేయాలని జగన్ భావిస్తున్నారు. మరి పాదయాత్రకు ఫలితం ఉంటుందా?
- Tags
- జగన్

