ఇక్కడ ఈపార్టీకి సెలైన్ ఎక్కించేదెవరు?

ఏపీ బిజెపికి కొత్త అధ్యక్షుడి వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. పాత అధ్యక్షుడు చురుగ్గా లేకపోవడం కొత్తవారిని నియమించకపోవడంతో ఏపీ బిజెపి డీలా పడింది. పెద్దగా పార్టీ కార్యక్రమాలు సైతం లేక సరైన దిశా దశ చెప్పేవారు లేక స్తబ్దుగా ఉండిపోయింది. ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిస్థితి కమలం శ్రేణులను నివ్వెరపరుస్తుంది. ఒక పక్క అధికార పార్టీ ఇంటింటికి టిడిపి పూర్తి చేసి ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉంటుంది. వైసిపి అధినేత స్వయంగా రంగంలోకి దిగి మాహా పాదయాత్రకు శ్రీకారం చుట్టి ప్రజా సంకల్పం పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఆఖరికి ఉందా లేదా అని నిన్న మొన్నటి వరకు అనుకున్న జనసేన సైతం యాక్టివేట్ అయ్యింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దాదాపు ఎనిమిది జిల్లాల కార్యకర్తలతో భేటీలు నిర్వహించారు. ఇక ప్రజలు ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించకపోయినా చురుగ్గా సమస్యలపై స్పందించే వామపక్షాలు పోలవరం వంటి అంశాల్లో ఉద్యమాలు కొనసాగిస్తున్నా బిజెపి మిన్నకుండి పోవడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు.
గుజరాత్ పైనే మూడు నెలలుగా ....
వాస్తవానికి గుజరాత్ లో విజయం సాధించడం బిజెపి అధినాయకత్వానికి జీవన్మరణ సమస్యగా మారింది. దాంతో వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణాదిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కమలనాధులు అన్ని ప్లాన్స్ తాత్కాలికంగా పక్కన పెట్టి గుజరాత్ లో తమ సర్వశక్తులు కేంద్రీకరించారు. దీనివల్ల అటు తెలంగాణ లో ముఖ్యంగా ఏపీ లో బిజెపి సుప్త చేతనావస్థలో కొట్టుమిట్టాడుతోంది. రోగ గ్రస్తంలో వున్న బిజెపికి ఇప్పుడు ఎప్పుడు సెలైన్ ఎక్కిస్తారా అని కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.
ఏపీలో గెలిచిన పార్టీని కలుపుకోవడమే బిజెపి స్ట్రేటజీ ...?
నాలుగు సీట్లు ఎక్కువ వచ్చే చోట దృష్టిపెట్టడం బెటరని ఏపీ లో, తెలంగాణ లో గెలిచిన పార్టీని కలుపుకోవడం తప్ప చేసేది పెద్దగా ఏమిలేదని ఆ పార్టీలో సీనియర్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. టిడిపి తో పూర్తి స్థాయిలో విభేదించలేని పరిస్థితి విడిపోయి బయటకు రాలేని దీనస్థితి లో కమలం కన్ఫ్యూజన్ లో వుంది. ప్రస్తుతం కలిసి వున్నా మోడీ కి హవా తగ్గిందని ఎన్నికల ముందు చంద్రబాబు భావిస్తే తమ చెయ్యి అప్పటికప్పుడు వదిలేసి జనసేన తో ముందుకు వెళతారని బిజెపి అలాంటి సమయంలో ఒంటరి అయ్యి నష్టపోతుందంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఈ నేపథ్యంలో సీరియస్ గా ప్రజాసమస్యలపై అధికారపక్షంపై పోరాటం చేస్తూ సొంత వ్యూహంతో ముందుకు వెళ్లాలని కొందరు చేస్తున్న సూచనలు పట్టించుకునే వారే లేరు.
జనంలోకి రాజమండ్రి ఎమ్యెల్యే ...
బిజెపి రాజమండ్రి ఎమ్యెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఇక లాభం లేదని స్వయంగా సొంత కార్యక్రమాన్ని రూపొందించి మొదలు పెట్టేశారు. మీ ఇంటికే మీ ఎమ్యెల్యే అన్న టైటిల్ తో ప్రజల్లోకి వెళ్ళే షెడ్యూల్ నిత్యం పెట్టుకున్నారు. ఇలా ఆయనలా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పిలుపుతో నడిచే కార్యక్రమం సీరియస్ గా నడిచేది ఒక్కటి లేకపోవడం గమనార్హం. గుండె గుండెకు బిజెపి అని గతంలో ప్రకటించినా అవేవి సీరియస్ గా నడవలేదు. ఇలా ఎన్నికల ముందే నీరసం కమలం శ్రేణులకు కలవరంగా మారింది.
- Tags
- బీజేపీ

