ఇక ముందస్తుకు మోడీ వెనుకంజ ....?

గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో అనుకున్న స్థాయిలో సీట్లు సాధించలేక పోవడం తో ముందస్తు ఎన్నికలపై మరోసారి దేశవ్యాప్త చర్చ మొదలైంది. హిమాచల్ ప్రదేశ్ లో కాషాయ దళం తనజండా పాతినా అక్కడ ఐదేళ్లకోసారి అధికార మార్పిడి చేయడం దశాబ్దాలుగా వస్తున్న ట్రెండ్. మరి అలా చూస్తే అక్కడ ఎవరు అధికారంలో వున్నా ఐదేళ్లు మాత్రమే. కనుక ఈ రాష్ట్రం విజయాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇప్పడు మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ ఎన్నికలనే అంతా లెక్కల్లోకి తీసుకుంటున్నారు. గుజరాత్ లో ప్రజలు భారీ విజయాన్ని కట్టబెట్టి ఉంటే మోడీ సర్కార్ ముందస్తుకు వెళ్లేందుకు అడుగు వేస్తుందని విశ్లేషకుల అంచనా. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది ?
మరో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూశాక ....
2018 లో నాలుగు పెద్ద రాష్ట్రాలు, నాలుగు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మూడు పెద్ద రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో వుంది. ఇక్కడ గుజరాత్ తరహాలోనే ఏటికి ఎదురీత తప్పేలా లేదు. రాబోయే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు గుజరాత్ లాగే ఉంటే కమలదళం వ్యూహం మారక తప్పదంటున్నారు విశ్లేషకులు. 2019 లో ఎన్నికలు జరిపితే ఈలోగా ప్రజావ్యతిరేకత కొంత వరకు అధిగమించే ప్రయత్నాలు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సంస్కరణల ను అమలు చేయడంతో బాటు సంక్షేమ కార్యక్రమాల ఏడాదిగా ఇక కాషాయ దళం అడుగులు వేయనుంది. దేశ వ్యాప్తంగా పార్లమెంట్ స్థానాల్లో ఎక్కడ బలంగా, ఎక్కడ బలహీనంగా ఉన్నామో అంచనా వేసుకునేందుకు ఆ పార్టీ ఆలోచించి వ్యూహాత్మకంగా వ్యవహరించనుంది. ఒకరకంగా గుజరాత్ ఫలితాలు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వున్న బిజెపి ని భావి ఎన్నికలకు మేల్కొలిపాయి. గుజరాత్ ఎన్నికల బీజేపీకి ఒక హెచ్చరిక లాంటిదనే చెప్పొచ్చు. దీంతో ముందస్తుకు బిజెపి ఖచ్చితంగా వెనుకడుగు వేసి దేశంలో జరగనున్న 8 రాష్ట్రాల ఎన్నికల విజయం పైనే కమలదళం ప్రధానంగా కన్నేయడమే లక్ష్యం గా మార్చుకుంటుందని విశ్లేషకుల అంచనా.
- Tags
- మోడీ

