ఇక జనాలకు నేతల జాతర

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణలో అన్ని పార్టీలూ జనం బాట పడుతున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే బస్సు యాత్ర తేదీలను ఖరారు చేసింది. ఈ నెల 26వ తేదీ నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర చేవెళ్ల నుంచి ప్రారంభం కానుంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా త్వరలోనే బస్సు యాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారు. అంతకంటే ముందుగా ఆయన ఈనెల 25, 26వ తేదీల్లో రైతు సమన్వయ సమితి నేతలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత లబ్దిదారులతో కేసీఆర్ నేరుగా సమావేశం కానున్నారు. ఇక బీజేపీ కూడా కార్యక్రమాల జోరును పెంచింది. తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ త్వరలోనే పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో తెలంగాణలో రాజకీయం హీటెక్కెంది.
రైతు నేతలతో సమావేశం....
అందరూ ఒక్కటైనా తాను మాత్రం ఈసారి గెలిచి తీరాలన్న లక్ష్యంతో కేసీఆర్ అన్ని రకాలుగా ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరలోనే రైతులకు పెట్టుబడి పథకం కింద ఎనిమిది వేల రూపాయలను ఇచ్చే పథకం ప్రారంభం కాబోతోంది. అయితే ఇందుకు ముందుగా కేసీఆర్ ఈ నెల 25వ తేదన హైదరాబాద్ లో దక్షిణ తెలంగాణ, 26వ తేదీన కరీనంగర్ లో ఉత్తర తెలంగాణ రైతు నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు. వీలయినంత త్వరాగా రైతు సమన్వయ సమితులను లైన్లోకి తేవాలని భావిస్తున్నారు. ఈ రెండు సమావేశాలు పూర్తయిన తర్వాత జిల్లాల వారీగా రైతులతో సమావేశం కావాలన్నది కేసీఆర్ ఆలోచన. ఈ సమావేశంలో లబ్డిదారుల ఎంపిక ఎలా ఉండాలి? పెట్టుబడి మొత్తం నగదు రూపంలో ఇవ్వాలా? బ్యాంకులో జమ చేస్తే సరిపోతుందా? అన్నది వారి నుంచే కేసీఆర్ తెలుసుకోనున్నారు.
బస్సు యాత్రకు ప్లాన్....
కాంగ్రెస్ బస్సు యాత్రకు పోటీగా తాను కూడా జిల్లాల పర్యటనను ప్రారంభించాలని భావించిన కేసీఆర్ ఈమేరకు పార్టీ ముఖ్యులకు ఆదేశాలు జారీ చేశారు. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్ల లబ్దిదారులతో కూడా కేసీఆర్ ముఖాముఖి నిర్వహించాలని యోచిస్తున్నారు. తాను కూడా బస్సు యాత్ర చేయాలనుకుంటున్నారు. తాను జిల్లాల పర్యటనలో ఉంటే పాలన అక్కడి నుంచే పాలనను పర్యవేక్షించాలని ఇప్పటికే అధికారులకు సంకేతాలు ఇచ్చారు. అన్ని జిల్లాలను ఒక్కసారి చుట్టి రావాలని నిర్ణయించుకున్నారు.
మిగిలిన పార్టీలూ.....
ఇక హస్తంపార్టీ నేతలు బస్సు యాత్రను ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు. రోజుకు రెండు నియోజకవర్గాల్లో బస్సుయాత్ర జరుగుతుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తాము గతంలో పెట్టిన సభలకే ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని, బస్సు యాత్రకు మామూలుగా స్పందన రాదని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పొన్న ప్రభాకర్ లు కూడా పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఇక బీజేపీ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గ్రామాల్లో ధూంధాలను నిర్వహిస్తోంది. దాదాపు యాభై బృందాలతో ప్రతి పల్లెను బీజేపీ టచ్ చేస్తోంది. ఇక సీపీఎం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరిట జిల్లాల వారీగా సభలను ఇప్పటికే ప్రారంభించింది. ఇక ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీని త్వరలోనే ప్రకటించనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన కూడా రైతులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, నిరుద్యోగులనే లక్ష్యంగా చేసుకుని వారి ప్రయోజనాల పరిరక్షణకోసం ముందుకెళుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో ఏడాదికి ముందే ఎన్నికల వేడి పెరిగిందనే చెప్పొచ్చు.

