ఆర్కే నగర్ వేడెక్కిందే...!

ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సిద్ధమయింది. బుధవారం కొందరు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ప్రధాన పార్టీ అభ్యర్థులు ఇంకా నామినేషన్లు దాఖలుచేయలేదు. స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే ప్రస్తుతం నామినేషన్లువేసిన వారిలో ఉన్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఇప్పటికే శశికళ మేనల్లుడు దినకరన్ రెడీ అయిపోయారు. దినకరన్ పేరును శశికళ ఖరారు చేశారు. నిన్న పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న శశికళను దినకరన్ కలిశారు. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దినకరన్ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. గత ఎన్నికల్లో పళనిస్వామి మద్దతులో దినకరన్ పోటీ చేశారు. కాని ఈసారి మాత్రం అధికార అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా దినకరన్ పోటీ చేయాల్సి ఉంది. మరోవైపు డీఎంకే కూడా తన అభ్యర్థిని ప్రకటించింది. డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్ ఇప్పిటకే ఆర్కే నగర్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
త్రిముఖ పోటీయేనా?
ఇక రెండాకుల గుర్తు వచ్చిందన్న జోష్ లో ఉన్న అధికార అన్నాడీఎంకే పార్టీ తాజాగా తమ అభ్యర్ధిగా మధుసూదనన్ ను ప్రకటించింది. మధుసూదనన్ గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పన్నీర్ సెల్వం వర్గం తరుపున పోటీ చేశారు. అయితే పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఒకటి కావడం, రెండాకుల గుర్తురావడంతో మధుసూదనన్ ను ఈరోజు అధికారపార్టీ తమ అభ్యర్థిగా ఎంపికచేసింది. మధుసూదనన్ గతంలో ఆర్కే నగర్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. పార్టీఅధినేత్రి జయలలిత కోసం ఆయన ఈసీటును అప్పట్లో త్యాగం చేశారు. రెండాకుల గుర్తు రావడంతో ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో టిక్కెట్ కోసం పోటీ తీవ్రంగానే ఏర్పడింది. మూడు రోజుల నుంచి అభ్యర్థుల దరఖాస్తులను పార్టీ స్వీకరించింది. అభ్యర్థి ఎంపిక కోసం కమిటీని కూడా నియమించింది. పోటీలో మధుసూదనన్, గోకుల ఇందిర తీవ్రంగా పోటీ పడ్డారు. అయితే చివరకు మధుసూదనన్ ఎంపికకు పళనిస్వామి అంగీకరించడంతో ఆయనే అధికార పార్టీ అభ్యర్ధిగా ఎంపికయ్యారు. అయితే పార్టీ గుర్తు కొంతవరకూ మధుసూదనన్ కు లాభించే అవకాశముందంటున్నారు. ఆర్కేనగర్ డీఎంకే తరుపున మరుదు గణేశ్, అన్నాడీఎంకే తరుపున మధుసూదనన్, శశికళవర్గం తరుపున దినకరన్ పోటీ చేయనున్నారు. మరో వైపు జయలలిత మేనకోడలు దీప కూడా పోటీ చేయనున్నారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ జరిగే అవకాశముంది.
- Tags
- ఆర్కే నగర్

