ఆర్కే నగర్ లో దినకర్ విజయమే ఖాయమా?

అన్నాడీఎంకే అధినేత్రి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మరణంతో తమిళ రాజకీయాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా గందరగోళంగా మారిన విషయం తెలిసిందే..! ఇక జయలలిత శాసనసభ్యురాలిగా ప్రాతినిధ్యం వహించిన చెన్నై మహానగరంలోని ఆర్కేనగర్ ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఓ మిస్టరీ సినిమా మాదిరిగా ఆసక్తిని రేకెత్తుస్తున్నాయిప్పుడు..! తమిళ హీరో విశాల్ ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ దిగాలనుకోవడం, నాటకీయ పరిణామాల మధ్య అతడి నామినేషన్ తిరస్కరణకు గురికావడం, అదో వివాదంగా మారడంతో ఈ ఎన్నిక ఇటు తెలుగు రాష్ట్రాల్లోను ఆసక్తిని రేకెత్తిస్తోందిప్పుడు..!
ప్రచారానికి తెర...
మంగళవారంతో ఇక్కడ ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇక ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి కి ఎక్కువ విజయావకాశాలున్నాయనే అంశంపై ఓ తమిళ పత్రిక నిర్వహించిన సర్వేలో వచ్చిన ఫలితాలు ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన నాయకులను ఖంగు తినిపించినట్టు సమాచారం. జయలలిత హఠాన్మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో అధికార అన్నాడీఎంకే తరపున ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ పోటీ చేస్తుండగా.. ప్రధాన ప్రతిపక్ష డీఎంకే నుంచి మరుదు గణేష్ పోటీ చేస్తున్నారు. కాగా జయలలిత నెచ్చెలి, అక్కడ రాజకీయ వివాదాలకు కేంద్రబిందువుగా ఉన్న శశికళ సోదరి కుమారుడు టీటీవీ దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అన్నాడీఎంకే నుంచి పోటీ చేస్తోన్న మధుసూదనన్ ఏపీలోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన వారు కావడం విశేషం.
దినకరన్ వైపే....
కాగా ప్రముఖ తమిళ పత్రిక కుముదం నిర్వహించిన సర్వేలో ఈ ఎన్నికల ఫలితాలు అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే అభ్యర్థులకు షాక్నివ్వడం ఖాయమని తేలిందట..! ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఎవరూ ఊహించనివిధంగా టీటీవీ దినకరన్ విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఈ సర్వేలో వెలుగు చూసినట్టు తెలుస్తోంది. దశాబ్దాల కాలంగా అక్కడి జనాలకు డీఎంకే పార్టీకి చెందిన ఉదయించే సూర్యుడు, అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకుల చిహ్నం తప్ప మరో పార్టీ అంటేనే తెలియదు. మొత్తంగా తమిళనాడు మాదిరిగానే ఇక్కడా ఈ రెండు పార్టీలే సుదీర్ఘకాలంగా హవా కొనసాగిస్తూ వచ్చాయి. కాగా టీటీవీ దినకరన్‌కు ఈ ఎన్నికల్లో ఫ్రెషర్ కుక్కర్ గుర్తు కేటాయించారు.
బీజేపీకి అవకాశమే లేదు...
కుముదం పత్రిక సర్వేలో ఆర్కేనగర్ నియోజకవర్గం ప్రజల్లో మిగిలినవారికంటే దినకరన్‌కే కాస్త ఎక్కువ మొగ్గు కనపడినట్టు సమాచారం. టీటీవీ దినకరన్ కు 27.5 శాతం మద్దతు పలుకుతుండగా.., అధికార అన్నాడీఎంకే అభ్యర్థికి 26.9 శాతం, విపక్ష డీఎంకేకి 24.8 శాతం మంది అండగా నిలిచే అవకాశముందని తేలిందట..! ఇక తమిళనాడులో పాగా వేయాలని ఎన్నోఆశలు పెట్టుకున్న బీజేపీకి ఇక్కడ తమ పప్పులు ఏమాత్రం ఉడికే అవకాశమే లేదని, ఆ పార్టీకి 0.5 శాతం ఓట్లకు మించి రావని ఆ సర్వే తేటతెల్లం చేసిందట..! మొత్తం మీద రాజకీయంగా తెరమరుగవుతుందని అందరూ అంచనా వేసుకున్న శశికళ వర్గం ఇక్కడ గెలవడమే కనుక జరిగితే తమిళ రాజకీయాలు వచ్చే కాలంలో మరెన్ని మలుపులు తిరగనున్నాయనేది నిజంగా ఎవరికీ అంతుచిక్కని పజిల్ అనే చెప్పాలి.
- Tags
- దినకరన్

