ఆర్కే నగర్...ఎవరిని వణికిస్తోంది?

ఆర్కే నగర్ ఉప ఎన్నిక...ఇప్పుడు తమిళనాడు కాదు యావత్ దేశాన్ని టెన్షన్ పెడుతుంది. ఇక్కడ గెలుపెవరిది? ఎవరికి ఛాన్స్ ఉంది. ఇదే చర్చ నడుస్తోంది. అయితే ఆర్కే నగర్ నియోజకవర్గం చెన్నై పట్టణానికి ఆనుకునే ఉంటుంది. ఈ నియోజకవర్గంలో అమ్మ జయలలితకు చెందిన అన్నాడీఎంకే పార్టీ ఏడుసార్లు గెలిచింది. జయలలిత ఇదే స్థానం నుంచి రెండుసార్లు ఎన్నికయ్యారు. రెండాకుల గుర్తుకు అంత పవర్ ఉంది ఆర్కే నగర్ లో. అయితే ఈసారి ఎన్నికలకు జయలలిత లేదు. రెండాకుల గుర్తు మాత్రం ఉంది. కాని అధికార అన్నాడీఎంకే పార్టీకి ఇక్కడి గెలుపు తప్పనిసరి అయిపోయింది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు గత పదిహేను రోజులుగా ఆర్కే నగర్ ను వదిలిపెట్టకుండా తిరుగుతున్నారు. ఎన్నికల వాగ్దానాలను ఇద్దరూ కుమ్మరిస్తున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థి అభ్యర్థి మధుసూదన్ కూడా ఇదే నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేయడంతో ఆయన గెలుపు తధ్యమని అధికార పార్టీ భావిస్తోంది. ఆర్కే నగర్ నియోకవర్గంలో అందరికీ గృహవసతిని కల్పిస్తామని, అపార్ట్ మెంట్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి పళనిస్వామి హామీలు గుప్పించారు. మొత్తం 54 వేల ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి ప్రతిపాదనలు కూడా రెడీ అయ్యాయన్నారు. అలాగే వచ్చే ఫిబ్రవరి 24న జయలలిత జయంతి సందర్భంగా మహిళకు రాయితీలో ద్విచక్రవాహనాలను పంపిణీ చేస్తామని హాీమ ఇచ్చారు. ఆర్కేనగర్ ను ఆదర్శనియోజకవర్గంగా తీర్చిదిద్ది జయ ఆశయాలను అమలుచేస్తామని వారు హామీ ఇచ్చారు.
ఇబ్బడి ముబ్బడిగా హామీలు....
ఇక శశికళ మేనల్లుడు దినకరన్ సయితం జయలలిత ఫొటోతో ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే పేదలందరికీ ఇళ్లు కట్టిస్తానని దినకరన్ హామీ ఇస్తున్నారు. దినకరన్ కు కూడా ఈ ఎన్నికలో గెలుపొందడం తప్పనిసరి. అందుకోసం ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. విశాల్ మద్దతు లభిస్తుందని ఆశించిన దినకరన్ కు ఆశాభంగం తప్పలేదు. విశాల్ పై నడిగర నిర్మాతల సంఘం తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేయడంతో విశాల్ కొంత వెనక్కు తగ్గారు. తాను ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఆర్కే నగర్ లో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండటంతో వారి ఓట్ల కోసం అన్ని పార్టీలూ తెలుగు వచ్చిన నేతలను రంగంలోకి దించుతున్నాయి. మరోవైపు డీఎంకే కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆర్కే నగర్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అన్నాడీఎంకే, దినకరన్ ఓట్లు చీల్చుకుంటే తమకు లాభమన్నది డీఎంకే ఆలోచన. అందుకోసమే స్టాలిన్ ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఓఖీ తుఫాను దెబ్బకు మత్స్యకారులందరూ అవస్థలు పడుతుంటే ప్రభుత్వానికి పట్టకుండా ఆర్కే నగర్ లో అలివికాని హామీలు ఇస్తుందని స్టాలిన్ దుయ్యబట్టారు. మరోవైపు బీజేపే ఆర్కే నగర్ లో విపరీతంగా డబ్బుల పంపిణీ జరుగుతుందని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.
- Tags
- ఆర్కే నగర్

