ఆయనకు పోటీగా వీరిద్దరూ ఒక్కటయ్యారు...!

అవును వారిద్దరూ ఒకటయ్యారు. ఉప్పు నిప్పులా ఉండే వారు చేతులు కలిపారు. ఎందుకో తెలుసా? తమ పరిధిలో జరుగుతున్న టెండర్లను దక్కించుకోవడానికి. వారే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి...ప్రస్తుత మంత్రి ఆదినారాయణరెడ్డి. కడప జిల్లాలో గండికోట పునరావాస కాలనీలో పనుల కోసం టెండర్లను పిలిచారు. పునరావాస కాలనీల్లో రోడ్ల నిర్మాణం, కాల్వలను ఈ పనులు చేజిక్కించుకున్న వాళ్లు చేయాల్సి ఉంది. ముంపుకు గురైన ముచ్చుమర్రి, నేదరపేట, కె.సుగుమంచి పల్లి, ముద్దనూరు మండం కొర్రపాడు గ్రామాల్లో నిర్వాసితుల కోసం ఈ పనులు చేపట్టాల్సి ఉంది. మొత్తం పనుల విలువ 25 కోట్ల రూపాయలు. అయితే ఈ పనుల కోసం తొలుత మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి సుబ్బారెడ్డిలు పోటీ పడ్డారు.
రిత్విక్ సంస్థ పోటీ పడటంతో....
అయితే ఈలోగా రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఎంట్రీ ఇచ్చారు. తనకు చెందిన రిత్విక్ సంస్థ ఈ టెండర్లలో పాల్గొనేందుకు సిద్ధమయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డి, ప్రభుత్వ విప్ రామసుబ్బారెడ్డి వర్గాలు ఒక్కటయ్యాయి. రెండు వర్గాలు కలిసి పోయి ఈ పనులు దక్కించుకునేందుకు సిద్ధమయ్యయి. అయితే విషయం తెలుసుకున్న సీఎం రమేష్ వర్గీయులు ఆయనకు చేరవేశారు. అయితే ఈ నెల 19వ తేదీన ఆ టెండర్లను నిలిపేసినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో టెండర్లను నిలిపేయడానికి సీఎం రమేష్ కారణమంటూ ఆయనకు చెందిన రిత్విక్ సంస్థపై దాడి చేశారు.
మంత్రి ఆది, రామసుబ్బారెడ్డిలపై ఒత్తిడి....
అయితే సీఎం రమేష్ మాత్రం ఆన్ లైన్ టెండర్లను తానెందుకు ఆపుతాననిప్రశ్నిస్తున్నారు. ఆ టెండర్లు ఈరోజు జరుగుతున్నాయి. మరికాసేపట్లో టెండర్లను అధికారులు తెరుస్తారు. మళ్లీ టెండర్ల సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తే అవకాశముందని భావించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి మీద ద్వితీయ శ్రేణి నేతలు తీవ్ర స్థాయిలో వత్తిడి తెస్తున్నారు. పెద్దపెద్ద ప్రాజెక్టులను చేపట్టే వారు తమ మండల పరిధిలో జరుగుతున్న పనులను కూడా చేజిక్కించుకోవడమేంటని వారు సీఎం రమేష్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. పనులు తమకే దక్కాలని మండల స్థాయి నాయకులు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలను పట్టుబడుతున్నారు. దీంతో కడప జిల్లా తెలుగుదేశం లోని మూడు వర్గాలకు ఈ టెండర్లు ప్రతిష్టాత్మకంగా మారాయి. మరికాసేపట్లో జరగనున్న టెండర్లు ఎవరికి దక్కుతాయో చూడాలి. మొత్తం మీద కడప జిల్లాలో టెండర్ల వ్యవహారంలో తెలుగు తమ్ముళ్లు అడ్డంగా చీలిపోయారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

