ఆయన పార్టీకి అంతా సిద్ధం....!

తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ఈరోజు పార్టీపై నిర్ణయం తీసుకోనున్నారా? పార్టీ ఉద్దేశ్యమేంటి? ఎందుకోసం పార్టీని పెట్టాల్సి వచ్చిందన్న విషయాలను ఈరోజు కోదండరామ్ క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈరోజు జేఏసీ కీలక సమావేశం జరుగుతోంది. ఇంజపూర్ లో రైతు సమస్యలపై సమన్వయ సమావేశం పేరుతో దీనిని ఏర్పాటు చేసినా ఇందులో ప్రధానంగా పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీని ఎప్పుడు ప్రకటించాలి...? పార్టీ పేరు? వంటి విషయాలను కూడా ఈరోజు నిర్ణయించనున్నట్లుతెలుస్తోంది.
అనుమతులు కూడా కరువే....
కోదండరామ్ నేతృత్వంలోని జేఏసీ గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. పలు సమస్యలపై ఉద్యమిస్తోంది. అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ అమరవీరుల స్ఫూర్తి యాత్ర పేరుతో జిల్లాల పర్యటనను ప్రారంభించింది. అయితే ఎక్కడికక్కడ టీఆర్ఎస్ శ్రేణులు జేఏసీ యాత్రలను అడ్డుకోవడం ప్రారంభించాయి. అలాగే ప్రభుత్వం నుంచి సభలకు, సమావేశాలకు అనుమతి లభించడం లేదు. నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేశారని అనేకసార్లు కోదండరామ్ ప్రభుత్వంపై విరుచుకుపడినా ప్రయోజనం లేకుండా పోయింది.
రెండు వారాల్లో ప్రకటన...
ఈ నేపథ్యంలో రాజకీయపార్టీగా ఉంటే అనుమతి అడక్కుండానే ఇస్తారని భావించిన కోదండరామ్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణలోని మేధావులు, కొన్ని వర్గాల నుంచి కూడా పార్టీ పెట్టాలని కోదండరామ్ పై వత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ పెట్టేందుకు మొగ్గుచూపారు. మరో రెండు వారాల్లో రాజకీయ పార్టీని కోదండరామ్ ప్రకటించబోతున్నారు. అందుకు సన్నాహక సమావేశం ఈరోజు జరగనుంది. ముందస్తు ఎన్నికలు వస్తాయని భావించడంతో కోదండరామ్ కూడా వివిధ వర్గాలతో చర్చలు జరిపారు.
నేడు కీలక సమావేశం....
పార్టీని వీలయినంత త్వరగా ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని కోదండరామ్ భావిస్తున్నారు. పార్టీ పేరును ఇప్పటికే ఖారారు చేసినట్లు సమాచారం. తెలంగాణ సకలజనుల పార్టీ, తెలంగాణ ప్రజాసమితి అని రెండు పేర్లు ప్రతిపాదనకు వచ్చాయి. ఇందులో తెలంగాణ ప్రజాసమితి పేరుకే కోదండరామ్ తో పాటు ఇతర జేఏసీ నేతలు కూడా ఓకే చేసినట్లు తెలిసింది. ఈ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు ఇంజపూర్ లో జరిగే జేఏసీ సమావేశంలో పార్టీ పేరును ఖరారు చేయనున్నారు. అలాగే పార్టీ ప్రకటన తేదీని కూడా నిర్ణయించనున్నారు. పార్టీ గుర్తుగా రైతు, నాగలి ఉండాలని కోదండరామ్ భావిస్తున్నారు. ఇక రాజకీయ పార్టీ పెడితే తెలంగాణ రాజకీయ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా విద్యుత్తు జేఏసీ ఛైర్మన్ రఘు ను నియమించనున్నట్లు తెలుస్తోంది. కోదండరామ్ మాత్రం జేఏసీకి ఆవిర్భావ అధ్యక్షుడిగా కొనసాగుతారని చెబుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో కోదండరామ్ పార్టీ త్వరలోనే అడుగుపెట్టబోతోంది.
- Tags
- కోదండరామ్

