ఆయన అలా.. ఈయన ఇలా.. జనం సంగతేంటి?

వారు మామూలు మధ్య తరగతి ప్రజలు.. మోసాల పోకడ అనుభవంలో తప్ప అలవాట్లలో తెలియని వారు. ఏదో తమ స్థాయికి తగిన డబ్బుకు సొంత ఇంటి కల తీరుతుందంటే.. అపార్ట్ మెంట్ లు కొనుక్కున్నారు. ఇప్పుడు అవన్నీ.. నీటి మడుగులో తేలియాడుతున్నాయి. వర్షం తగ్గితే బయటపడతామురా భగవంతుడా అనుకుంటూ.. రోజులు నెట్టుకొస్తున్నారు.. ఈలోగా... సర్కారు వారు వచ్చి.. మీరంతా ఈ లేఅవుట్ లో ఉండడానికే వీల్లేదు. ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందే అని హుకుం ఇస్తే వారేం చేయగలరు. పాపం.. భాగ్యనగరంలోని కొన్ని లేఅవుట్లలోని సామాన్యుల పరిస్థితి ఇలాగే ఉంది.
ప్రత్యేకించి భాగ్యనగరం నిజాంపేట్ లోని భండారి లే అవుట్ లో అపార్ట్ మెంట్లన్నీ నీట మునిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే నగర మేయర్ బొంతు రామ్మోహన్ వచ్చి .. అక్కడి ప్రజలంతా లే అవుట్ ను ఖాళీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించేశారు. జనం షాక్ తిన్నారు. జీహెచ్ ఎంసీ అప్రూవల్స్ ఉన్న లే అవుట్ అది. ఇవాళ ఖాళీ చేయాలంటున్న అధికారులు ఆరోజు అప్రూవల్స్ ఎలా ఇచ్చారనేది ప్రశ్న.
ఇదిలా ఉండగా.. జనంలో ఆందోళనను గమనించిన మంత్రి జూపలి క్రిష్ణారావు మాత్రం.. మేయర్ కు ఏమీ తెలియదని... జనం లేఅవుట్ ఖాళీ చేయాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇచ్చారు. ఇద్దరూ తెరాస నాయకులే. ఒకరు ప్రభుత్వంలో మంత్రి అయితే.. ఒకరు నగర జీవుల బాగోగులు చూసుకోవాల్సిన ప్రథమ పౌరుడు. మరి ఆయన అలా, ఈయన ఇలా మాట్లాడుతూ ఉంటే.. జనం గందరగోళానికి గురికాక ఏమవుతారు.
వర్షాలు కురిస్తే సరైన నిర్వహణ చర్యలు, నష్ట నివారణ, పద్ధతైన విపత్తు నిర్వహణ చేతకాని యంత్రాంగం, వ్యవస్థ కు నేత్రుత్వం వహిస్తున్న వారు ఇలాంటి ప్రకటనలతో ప్రజలను మరింత అయోమయానికి గురిచేయడం సబబు కాదని పలువురు అంటున్నారు.

