ఆపరేషన్ ఆకర్ష్ వికటిస్తుందా?

ఆపరేషన్ ఆకర్ష్ వల్ల జగన్ కు నష్టమా? టీడీపీకి లాభమా? ఏది అని అంచనా వేయడం కొంత కష్టమే. నేతలు ఎక్కువయ్యే కొద్దీ కుమ్ములాటలు హెచ్చుమీరిపోతాయి. ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 20 మంది ఎమ్మెల్యేలకు ఏ టీడీపీ నేత ఆ నియోజకవర్గంలో సహకరించడం లేదన్నది వాస్తవం. ఎందుకంటే 20 నియోజకవర్గాలను పరిశీలించిన టీడీపీ అధినేతకే ఈ విషయం బోధపడిందట. ఒకటి కాదు రెండు ఇరవై నియోజకవర్గాల్లోనూ సేమ్ సీన్. అధినేత ఎన్నిసార్లు చెప్పినా నియోజకవర్గ ఇన్ ఛార్జులకు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసలు పడటం లేదు. అధికారుల బదిలీల దగ్గర నుంచి నీరు-చెట్లు పనుల వరకూ ఇద్దరి మధ్య ఆధిపత్యపోరే. వీరిద్దరి మధ్య అధికారులు బలవుతున్నారే కాని నాయకులు మాత్రం తమ పంతం వీడటం లేదు. ఆ యా జిల్లా కలెక్టర్లకు నేతలు తెస్తున్న ఒత్తిడులు ఎప్పటికప్పుడు అధికారులు చెబుతున్నా పట్టించుకునే వారేలేరు. పోనీ జిల్లా ఇన్ ఛార్జి మంత్రికి చెప్పి పరిష్కరించుకోవాలనుకున్నా.... వారి వల్ల కాని పరిస్థితి.
వచ్చే ఎన్నికల్లో కలసి పనిచేస్తారా?
జమ్మలమడుగు, అద్దంకి, పలమనేరు, కందుకూరు ఇలా ఒకటేమిటి అన్ని నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి. పార్టీ ఇన్ ఛార్జులు తామే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు వారిని ఏమీ అనలేకపోతున్నారు. ఇటీవల ఇంటింటికీ తెలుగుదేశంపార్టీ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ 20 నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ఎవరికి వారు చేసుకుపోతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లోనూ ప్రశ్నించారు. కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. అయితే తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జులు మాత్రం వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎన్నాళ్ల నుంచో పార్టీలో ఉన్నవారిని కాదని తమ అనుచరులకు పెద్దపీట వేస్తున్నారని కంప్లయింట్ చేశారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా ఇన్ ఛార్జుల జోక్యం ఎక్కువయిందని చెప్పుకొచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఒకరి గెలుపుకు మరొకరు సహకరిస్తారా? అన్నది అనుమానంగానే ఉంది. మొత్తం మీద చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ వికటించేలా ఉందని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. బలం పెరుగుతుందనుకుంటే.. అసలుకే ఎసరు వస్తుందని సీనియర్ నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

